కామాంధుని కఠినంగా శిక్షించాలి
అమలాపురం రూరల్ : అమలాపురంలో పసిమొగ్గలపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు రెడ్డి సూర్యానారాయణను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్.రమణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినులపై అఘాయిత్యం చేయడం అమానుషమని పేర్కొన్నారు. సూర్యనారాయణకు బెయిల్ కూడా మంజూరు చేయవద్దని, అతని తరఫున న్యాయవాదులెవరూ వాధించరాదని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు మోర్త రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ నాయకులు కె.శంకర్, పి.వసంత్‌కుమార్, ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి.నాగవరలక్ష్మి, జి.పద్మ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కె.వెంకటేశ్వరరావు, బొక్కా విజయలక్ష్మి, కె.సరస్వతి, కౌన్సిలర్ దంగేటి గౌరి, టి.సాయిసుజాత, సిహెచ్.సూర్యకళ పాల్గొన్నారు. అనంతరం వారంతా పట్టణ ఎస్సై జి.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
లైంగికదాడుల్లో నిందితులపై కఠిన చర్యలు
అమలాపురం టౌన్ : అమలాపురంలో వృద్ధ కామాంధుడి అకృత్యానికి బలై అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు బాలికలను, వారి తల్లిదండ్రులను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణవేణి హోంమంత్రికి వివరించారు. ఈ కేసులో నిందితుడిపై నిర్భయ చట్టంతోసహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు రాజప్ప బాధితుల తల్లిదండ్రులకు వివరించారు. లైంగిక వేధింపుల కేసులలో త్వరగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని రాజప్ప డీఎస్పీ ఎల్.అంకయ్యను ఆదేశించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రాజప్పతో ఉన్నారు.