అంతర్జాతీయ లేడీ స్మగ్లర్ సంగీత అరెస్టు
కోల్‌కతాలో అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలింపు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ స్మగ్లర్ సంగీత చటర్జీ(26)ని చిత్తూరు పోలీసులు ఎట్టకేలకు మంగళవారం కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చారు. బుధవారం పాకాల న్యాయమూర్తి దేవేంద్రరెడ్డి ఎదుట హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. 2015లో కల్లూరులో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సంగీత చటర్జీపై కేసు నమోదైంది. కల్లూరుతో పాటు యాదమరి, నిండ్ర పోలీస్స్టేషన్లలోనూ ఆమెపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి.
కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ మోడలింగ్ రంగంలో ప్రవేశించి.. అనంతరకాలంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే చెన్నైకి చెందిన మార్కొండ లక్ష్మణ్‌తో ఆమె ప్రేమలో పడింది. 2013లో వీరిద్దరి వివాహం జరిగింది. 2014లో ఎర్రచందనం కేసుల్లో లక్ష్మణ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో తన స్నేహితుల ద్వారా కోట్ల రూపాయలను సంగీత బ్యాంకు ఖాతాలో జమ చేయించేవాడు. ఇందులో రూ.2 కోట్ల నగదును సంగీత హవాలా రూపంలో జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లకు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.