4 నెలల కనిష్టానికి ‘ఇన్ఫ్రా’ వృద్ధి
మేలో 2.3 శాతం
ఏప్రిల్-మే నెలల్లో ఈ రేటు 3.3%
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 2014 మే నెలలో 2.3 శాతంగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. జనవరి తరువాత (1.6 శాతం వృద్ధి) ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ రంగాల పేలవ పని తీరు మొత్తం పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటును వెనక్కు లాగింది. 2014 ఏప్రిల్ నెలలో 8 పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతం. 2013 మే నెలలో వృద్ధి రేటు 5.9 శాతం. 2013 మే నెలతో పోల్చితే 2014 మేలో 8 పరిశ్రమల పనితీరు ఇలా...
వృద్ధి బాటలో 4...
బొగ్గు: క్షీణతలోంచి వృద్ధి బాటకు మెరుగుపడింది. -3.3 క్షీణత 5.5 శాతం వృద్ధిలోకి మళ్లింది.
ఎరువులు: ఎరువుల పరిశ్రమ -2.0 శాతం క్షీణత నుంచి 17.6 శాతం వృద్ధికి ఎగసింది.
సిమెంట్: ఈ రంగం వృద్ధి 2.5 శాతం నుంచి 8.7 శాతానికి మెరుగుపడింది.
విద్యుత్: ఈ రంగంలో వృద్ధి స్వల్పంగా పెరిగి 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది.
క్షీణతలో 4...
క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే కొనసాగుతోంది. అయితే ఇది -2.5% నుంచి -0.3 శాతానికి మెరుగుపడింది.
సహజ వాయువు: క్షీణతలోనే కొనసాగుతున్నా... ఇది -18.7 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.
రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి బాట నుంచి క్షీణ బాటకు పడిపోయింది. 4.9% వృద్ధి నుంచి -2.3%కి పడింది.
స్టీల్: రిఫైనరీ ప్రొడక్టుల తరహాలోనే 22.4 శాతం వృద్ధి, -2.0 శాతానికి జారిపోయింది.
రెండు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్, మే) మౌలిక వృద్ధి రేటు 3.3%గా ఉంది. 2013 ఇదే నెలల్లో ఈ రేటు 4.9%. మొత్తం పారిశ్రామికోత్పిత్తిలో ఈ 8 పరిశ్రమల గ్రూప్ వెయిటేజ్ దాదాపు 38 శాతం.