ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతా
జడ్చర్ల రూరల్, న్యూస్‌లైన్: ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతా ఇవ్వడమే లక్ష్యమని, అగ్రిక్రెడిట్ కార్డులను మార్చి నెలాఖరులోగా అందజేస్తామని, ఏప్రిల్‌నుంచి డెబిట్‌కార్డులను కూడా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) రీజినల్ మేనేజర్ కె.బాలమురళికృష్ణ తెలిపారు. బుధవారం జడ్చర్ల బ్రాంచ్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇచ్చే పంటరుణాలు, ఇతర రుణాలను ఇకపై క్రెడిట్ కార్డుద్వారా తీసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్రెడిట్‌కార్డు ఇవ్వడం ద్వారా రైతులకు ఒకేసారి మొత్తం రుణం ఇవ్వకుండా అతనికి అవసరమైనప్పుడు కార్డుద్వారా డబ్బులు తీసుకునే వీలుందని దీంతో కొంతవరకు డబ్బులు ఆదా చేసుకుంటారని తెలిపారు.
ఒకరైతుకు నాలుగెకరాల భూ మి ఉంటే 80వేల రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. దా నితో పాటు అతనికి ఇతర అవసరాలకోసం మరో పది వేలు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 61 బ్రాంచ్‌ల ద్వారా 1.12లక్షల మందికి రూ.277కోట్ల వ్యవసాయ సంబంధిత రుణాలు, అదేవిధంగా 10,497మహిళా గ్రూపులకు రూ.136కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రైతులు తాము తీసుకున్న రుణాలను ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వారికి వడ్డీలేని రుణాలు అందుతాయన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏడాదిలోపు ఒక్కరోజు కూడా ఎక్కువ కాకుం డా రుణాలు చెల్లించి వడ్డీని మాఫీచేయించుకోవాలని సూచించారు.
ఆధార్‌కార్డులు ఇవ్వండి
ఏపీజీవీబీ ఖాతాదారులంతా త్వరగా తమ ఆధార్ కార్డులను సమర్పించాలని ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ కె.బాలమురళికృష్ణ కోరారు. ఆధార్ నంబర్ ఉండటం ద్వారా నగదు బదిలీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. సమావేశంలో మేనేజర్ అడ్వాన్స్ బస్వంత్‌రెడ్డి, జడ్చర్ల బ్రాంచ్ మేనేజర్ రవికాాంత్ తదితరులు పాల్గొన్నారు.