Registration department officers
-
ఆస్తి ఒక్కటే.. రిజిస్ట్రేషన్ ఇద్దరికి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఇటీవల జిల్లా రిజిస్ట్రార్‌పై కేసు నమోదుకు కారణమైన ఆస్తి వివాదంలో రిజిస్ట్రే షన్ శాఖ అధికారులు చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబ వివాదాల్లో ఉన్న ఆస్తికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం.. రద్దు చేయడం రోజుల వ్యవధిలోనే జరిగింది. చివరికి అదే ఆస్తికి ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేసి ధ్రువపత్రాలు ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల వారు ఆస్తి మాదంటే మాది అంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించడం, పోలీసు కేసులు పెట్టుకోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌పై కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివాదంలో ఉన్న ఆస్తి ఇదే.. కందుకూరు పట్టణంలోని అమలనాథునివారిపాళెంలో సర్వే నంబర్ 865/1ఎ/1ఎ2ఎ1లో శెట్టి పేరయ్య అనే వ్యక్తి పేరుపై మూడున్నర సెంట్ల నివాస స్థలం ఉంది. పేరయ్యకు ఐదుగురు కుమార్తెలతోపాటు కోటేశ్వరరావు(ప్రభుత్వ ఉద్యోగి) అనే కుమారుడు ఉన్నాడు. కుమార్తెల్లో శాంతికుమారి అలియాస్ కుమారి దివ్యాంగురాలు కావడంతో మిగిలిన కుటుంబసభ్యులు ఆ ఆస్తిని ఆమె పేరుపై రాశారు. 2016లో ఆమె కూడా మరణించింది. ఆ తరువాతే ఈ స్థలం కోసం కుటుంబసభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఇటు కోటేశ్వరరావు ఆ స్థలం నాదేనని వాదిస్తుండగా, ఆయన తల్లి నారాయణమ్మ ఆ స్థలం తన పేరుపై ఉందని చెబుతోంది. ఈ క్రమంలో తల్లీ, కొడుకు మధ్య వివాదం ఉండడంతో నారాయణమ్మ కావలిలో ఉంటున్న కుమార్తె వద్ద ఉంటూ మనవడు అయిన భానుకుమార్‌కు అదే ఆస్తిని రాసిచ్చింది. ఈ క్రమంలో రూ.కోటి విలువ చేసే ఆ ఆస్తి వివాదంగా మారింది. రిజిస్ట్రేషన్ చేయడం.. రద్దు చేయడం శాంతికుమారి చనిపోయే నాటికి ఆ ఆస్తి ఆమె పేరుపైనే రిజిస్ట్రేషనై ఉంది. కానీ కందుకూరు సబ్ రిజి స్ట్రార్ కార్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అదే ఆస్తిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేశారు. అదెలా అంటే శాంతికుమారి సోదరుడు కోటేశ్వరరావు ఆ ఆస్తి తన ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూశాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు. భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించి కోటేశ్వరి పేరుపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగా కోటేశ్వరరావు తల్లి నారాయణమ్మ తన కూతురు ఆస్తి తనకు చెందుతుందని, హక్కుదారుగా తన మనువడు భానుకుమార్ పేరుపై సేల్ డీడ్ చేసింది. దాని ఆధారంగా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సందర్భంలో మరోసారి కోటేశ్వరి పేరుపై అదే ఆస్తిని రిజిస్ట్రేషన్ కోసం కోటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు డాక్యుమెంట్లు రావడంతో అధికారులు వీటిని తిరస్కరించారు. అనంతరం కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శాంతికుమారి ఆ ఆస్తిని తనపై వీలునామా రాసినట్లు చూపి అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరోసారి తన భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై భానుకుమార్ పోలీస్ కేసు పెట్టడంతో ఆ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్ చేయించాడు. భానుకుమార్ నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా దాన్ని పరిశీలన కోసం కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. పోలీసుస్టేషన్లో ఆ ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నందున భానుకుమార్ పెట్టుకున్న డాక్యుమెంట్‌ను రెప్యూజ్ చేస్తున్నట్లు కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తెలిపారు. దీంతో భానుకుమార్ నేరుగా జిల్లా రిజిస్ట్రార్‌కు అప్పీల్ చేసుకున్నాడు. పరిశీలించిన డీఆర్ అన్ని సక్రమంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో భానుకుమార్ పేరుపై ఆస్తి నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తరువాత కోటేశ్వరరావు రిజిస్ట్రేషన్ అయిన అదే ఆస్తిని మళ్లీ మరోసారి కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. చివరకు భానుకుమార్ రిజిస్ట్రేషన్ నకిలీ అని కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో రిజి స్ట్రేషన్ ఆర్డర్ ఇచ్చిన జిల్లా రిజిస్ట్రార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును లోతుగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘చేనేత’ భూమి రిజిస్ట్రేషన్ రద్దు
పాలకవర్గం అమ్మేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇది ‘సాక్షి’ క్రెడిట్ : ఏడీ ధనుంజయరావు సాక్షి ప్రతినిధి, ఏలూరు :టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏలూరులోని చేనేత సహకార సంఘానికి చెందిన సుమారు 4వేల గజాల స్థలాన్ని అతితక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యవహారం బెడిసికొట్టింది. ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమికి సంబంధించి జనవరిలో తాము చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదంటూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మంగళవారం చేనేత జౌళి శాఖ ఏడీ బి.ధనుంజయరావుకు పంపారు. పూర్వాపరాల్లోకి వెళితే.. ఏలూరు వీవర్స్ కాలనీలో సుమారు 4వేల గజాల చేనేత సహకార సొసైటీ స్థలాన్ని భాగాలుగా చేసి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, పార్టీ నగర శాఖ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌కుమార్‌తోపాటు అదే పార్టీకి చెందిన రెడ్డి వెంకటరమణ, నడిపూడి ఈశ్వరరావు, లంకా తిరుపతి, ఆరంగి మురళీకృష్ణ, రాజనాల రామచంద్రరావు, గద్దె రుష్యేంద్ర నాగవర దుర్గాప్రసాద్ కొనుగోలు చేశారు. గజం రూ.8వేల చొప్పున మొత్తం స్థలాన్ని రూ.3.06 కోట్లకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.8 కోట్లకు పైగా విలువ చేసే ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకు, నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన వ్యవహారాన్ని ‘భూమంత్రకాళి’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. రంగంలోకి దిగిన చేనేత, జౌళిశాఖ అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు సమాచారం అందించారు. సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఈ విషయమై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే స్థలాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రిజిస్ట్రేషన్ అధికారులు ఆ స్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు దస్తావేజులను చేనేత జౌళి శాఖ అధికారులకు పంపారు. ఇది ‘సాక్షి’ క్రెడిట్ చేనేత, ఔళి శాఖ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన స్థలాల రిజిస్ట్రేషన్లు చట్టవ్యతిరేకమని చేనేత, జౌళి శాఖ జిల్లా ఏడీ బి.ధనుంజరావు అన్నారు. మంగళవారం సాయంత్రం రిజిస్ట్రేషన్ అధికారులు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో ఆయన వీవర్స్ కాలనీలోని స్థలం వద్దకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్-9ఏ ప్రకారం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సాక్షి’ వల్లే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని, ‘సాక్షి’ వరుస కథనాలతోనే తాము నైతికంగా పోరాటం చేయగలిగామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ స్థల రిజిస్ట్రేషన్ రద్దు క్రెడిట్ పూర్తిగా ‘సాక్షి’కే చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.