ఆస్తి ఒక్కటే.. రిజిస్ట్రేషన్‌ ఇద్దరికి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి ఒక్కటే.. రిజిస్ట్రేషన్‌ ఇద్దరికి

Published Mon, Aug 28 2023 12:08 AM | Last Updated on Mon, Aug 28 2023 1:49 PM

- - Sakshi

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఇటీవల జిల్లా రిజిస్ట్రార్‌పై కేసు నమోదుకు కారణమైన ఆస్తి వివాదంలో రిజిస్ట్రే షన్‌ శాఖ అధికారులు చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబ వివాదాల్లో ఉన్న ఆస్తికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు రిజిస్ట్రేషన్‌ చేయడం.. రద్దు చేయడం రోజుల వ్యవధిలోనే జరిగింది. చివరికి అదే ఆస్తికి ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులపై రిజిస్ట్రేషన్‌ చేసి ధ్రువపత్రాలు ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల వారు ఆస్తి మాదంటే మాది అంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించడం, పోలీసు కేసులు పెట్టుకోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌పై కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వివాదంలో ఉన్న ఆస్తి ఇదే..
కందుకూరు పట్టణంలోని అమలనాథునివారిపాళెంలో సర్వే నంబర్‌ 865/1ఎ/1ఎ2ఎ1లో శెట్టి పేరయ్య అనే వ్యక్తి పేరుపై మూడున్నర సెంట్ల నివాస స్థలం ఉంది. పేరయ్యకు ఐదుగురు కుమార్తెలతోపాటు కోటేశ్వరరావు(ప్రభుత్వ ఉద్యోగి) అనే కుమారుడు ఉన్నాడు. కుమార్తెల్లో శాంతికుమారి అలియాస్‌ కుమారి దివ్యాంగురాలు కావడంతో మిగిలిన కుటుంబసభ్యులు ఆ ఆస్తిని ఆమె పేరుపై రాశారు. 2016లో ఆమె కూడా మరణించింది.

ఆ తరువాతే ఈ స్థలం కోసం కుటుంబసభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. ఇటు కోటేశ్వరరావు ఆ స్థలం నాదేనని వాదిస్తుండగా, ఆయన తల్లి నారాయణమ్మ ఆ స్థలం తన పేరుపై ఉందని చెబుతోంది. ఈ క్రమంలో తల్లీ, కొడుకు మధ్య వివాదం ఉండడంతో నారాయణమ్మ కావలిలో ఉంటున్న కుమార్తె వద్ద ఉంటూ మనవడు అయిన భానుకుమార్‌కు అదే ఆస్తిని రాసిచ్చింది. ఈ క్రమంలో రూ.కోటి విలువ చేసే ఆ ఆస్తి వివాదంగా మారింది.

రిజిస్ట్రేషన్‌ చేయడం.. రద్దు చేయడం
శాంతికుమారి చనిపోయే నాటికి ఆ ఆస్తి ఆమె పేరుపైనే రిజిస్ట్రేషనై ఉంది. కానీ కందుకూరు సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అదే ఆస్తిని పలుమార్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. అదెలా అంటే శాంతికుమారి సోదరుడు కోటేశ్వరరావు ఆ ఆస్తి తన ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూశాఖ అధికారుల నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకున్నాడు. భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాడు. అనంతరం రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌ చేయించి కోటేశ్వరి పేరుపై మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్‌ చేశారు.

ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగా కోటేశ్వరరావు తల్లి నారాయణమ్మ తన కూతురు ఆస్తి తనకు చెందుతుందని, హక్కుదారుగా తన మనువడు భానుకుమార్‌ పేరుపై సేల్‌ డీడ్‌ చేసింది. దాని ఆధారంగా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సందర్భంలో మరోసారి కోటేశ్వరి పేరుపై అదే ఆస్తిని రిజిస్ట్రేషన్‌ కోసం కోటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు డాక్యుమెంట్లు రావడంతో అధికారులు వీటిని తిరస్కరించారు. అనంతరం కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శాంతికుమారి ఆ ఆస్తిని తనపై వీలునామా రాసినట్లు చూపి అక్కడే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

ఆ తరువాత ఆ డాక్యుమెంట్‌ తీసుకొచ్చి కందుకూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరోసారి తన భార్య కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించాడు. దీనిపై భానుకుమార్‌ పోలీస్‌ కేసు పెట్టడంతో ఆ రిజిస్ట్రేషన్‌ను కూడా క్యాన్సిల్‌ చేయించాడు. భానుకుమార్‌ నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోగా దాన్ని పరిశీలన కోసం కందుకూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపారు. పోలీసుస్టేషన్‌లో ఆ ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నందున భానుకుమార్‌ పెట్టుకున్న డాక్యుమెంట్‌ను రెప్యూజ్‌ చేస్తున్నట్లు కందుకూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు తెలిపారు.

దీంతో భానుకుమార్‌ నేరుగా జిల్లా రిజిస్ట్రార్‌కు అప్పీల్‌ చేసుకున్నాడు. పరిశీలించిన డీఆర్‌ అన్ని సక్రమంగా ఉండడంతో రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో భానుకుమార్‌ పేరుపై ఆస్తి నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయింది. ఆ తరువాత కోటేశ్వరరావు రిజిస్ట్రేషన్‌ అయిన అదే ఆస్తిని మళ్లీ మరోసారి కోటేశ్వరి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారు. చివరకు భానుకుమార్‌ రిజిస్ట్రేషన్‌ నకిలీ అని కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో రిజి స్ట్రేషన్‌ ఆర్డర్‌ ఇచ్చిన జిల్లా రిజిస్ట్రార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును లోతుగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement