Registration of FIR
-
‘నా కుమారుడిని చంపేశారు’
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బేగంపేట్ బ్రాహ్మణ్‌వాడీకి చెందిన రూపాని లక్ష్మమ్మ ఆరోపించారు. గత నెల 17న రాత్రి 10.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ధారూర్ లక్ష్మీనగర్‌తండాకు చెందిన పెంటయ్య కుమారుడు విస్లావత్ రాము వచ్చి తన కొడుకు లక్ష్మణ్ (22)ను బైక్‌పై తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగిందని రాముతో పాటు అతడి వెంట ఇద్దరు వ్యక్తులు వచ్చి తెలిపారన్నారు. అయితే రాత్రి వేళ తన కొడుకును ఎందుకు తీసుకువెళ్లావని రామును ప్రశ్నిస్తుండగా, అతడితో వచ్చిన ఇద్దరు తాము కానిస్టేబుళ్లమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. తన కుమారుడ్ని హత్య చేశారని, నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నెల రోజులు గడుస్తున్నా కనీసం తమ ఫిర్యాదును కూడా స్వీకరించడం లేదని వాపోయింది. ఇంతవరకు పోస్టుమార్టమ్ నివేదిక కూడా తమకు చూపించలేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం: ఎస్సై నర్సింగ్‌రావు రూపాని లక్ష్మమ్మ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశామని ఎస్సై నర్సింగ్‌రావు అన్నారు. నిందితులను విచారించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చి రెండు రోజులే అయ్యిందని, వారు వస్తే తప్పకుండా అందజేస్తామని అన్నారు. -
పూర్తి వివరాలు కోర్టు ముందుంచండి
‘సరస్వతి’ వ్యవహారంలో ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ వచ్చేవారానికి వాయిదా హైదరాబాద్: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై గుంటూరు జిల్లా మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ అధికారులను ఆదేశించింది. అంతేగాక సరస్వతి పవర్ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిపై ఆ కంపెనీ ప్రతినిధులిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి గల కారణాలను సైతం తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ రెండు వ్యవహారాల్లో వివరాలను వచ్చేవారంలోగా తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మాచవరం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ, తమ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినవారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆదిరాజు వేణుగోపాలరాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ పుర్కర్ మంగళవారం విచారించారు. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్కెట్‌ధర కన్నా అధిక మొత్తం చెల్లించి రైతులనుంచి సరస్వతి పవర్ భూములను కొనుగోలు చేసిందని కోర్టుకు నివేదించారు. భూములు అమ్మినవారే భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని, అడ్డువచ్చిన సరస్వతి సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. ఇదే సమయంలో పిటిషనర్లు ఇతరులపై దాడి చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. పోలీసులు పిటిషనర్లపై కేసు నమోదు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రెండు కేసుల్లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హోంశాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు.