తెరుచుకోని ముల్లకట్ట ప్రాథమిక పాఠశాల
ఏటూరునాగారం : మారుమూల అటవీ గ్రామమైన ముల్లకట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంగళవారం తెరుచుకోలేదు. ఇక్కడ బడి గంటలు మోగలేదు. చదువుకునే పిల్లలు చెట్ల కింద కోతికొమ్మచ్చి ఆడుకుంటూ కనిపించారు. ఎందుకు ఆడుతున్నారంటే... బడికి సారత్తలేడు.. మేం ఆడుకుంటానం అన్నారు. ముల్లకట్ట పాఠశాలకు గత ఏడాది నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల చదువు కుంటుపడుతోంది. చదువుకోవాల్సిన పిల్లలు చెట్లు, పుట్టలు, తునికికాయలు ఏరడానికి వె ళుతున్నారు. గత ఏడాది మెటర్నటీ సెలవుపై ఉపాధ్యాయురాలు సజిత వె ళ్లిపోగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఒక రోజు తె రిస్తే రెండు రోజులు మూత పడి ఉంటుంది. దీంతో విద్యార్థులు చదువుకోలేని దుస్థితి నెలకొంది.
ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయురాలు లేకపోవడంతో తోలెం భాగ్యలక్ష్మి అనే మహిళ ను ఎంఈఓ గొర్రె కొమురయ్య విద్యావలంటీర్‌గా నియమించారు. ఆమెకు నెలకు రూ.2,500 వేతనం ఇస్తానని చెప్పి కేవలం రెండు నెలలు కలిపి రూ.2,200 ఇచ్చారు. అయితే ఆ వేతనానికి పని చేయలేనని భాగ్యలక్ష్మి బడికి వెళ్లడం మానేసింది. అప్పటి నుంచి సీఆర్పీలను వంతుల వారిగా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడంతో మూసి ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంఆర్సీ భవనంలో డిప్యూటేషన్‌పై ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, వారిని ముల్లకట్టకు పంపించేలా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ గొర్రె కొమురయ్యను వివరణ కోరగా సీఆర్పీలను ప్రతి రోజు పాఠశాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. అయితే మంగళవారం పరీక్ష పేపర్లు రావడం వల్ల క్లస్టర్ వారీగా సరఫరా చేయాలని సీఆర్పీలను కోరానని, అందువల్లనే ముల్లకట్టకు వెళ్లలేదన్నారు.