మీ సేవకుడిగా పనిచేస్తా..
పరకాల, న్యూస్‌లైన్ : ఈ గెలుపు నా ఒక్కడిది కాదు.. పరకాల నియోజకవర్గ ప్రజలదే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలిసారి శుక్రవారం పరకాల పట్టణానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పాలికారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు రేగూరి విజయపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను వమ్ము చేయను.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరువేస్తానని చెప్పారు. పక్క నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా పరకాల పట్టణంతోపాటు గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తానని తెలిపారు.
చలివాగు బెల్టులోని కామారెడ్డిపల్లి, ధర్మారం, నడికూడ, రామకృష్ణాపూర్, ముస్త్యాలపల్లి గ్రామాల్లో లిప్ట్‌లు నిర్మించి గ్రామానికి వెయ్యి ఎకరాల చొప్పున సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజకీయ కక్షలు లేవు.. ఎలక్షన్లు లేవు.. ఐదేళ్ల పాటు మీ సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. 1979లో ప్రగతి సింగారం నుంచి సినిమా చూడడానికి ఇక్కడకు వచ్చాను.. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేదు.. గత పాలకులకు చూపిన వివక్షకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగడంతో విజయం చేరువైందని వివరించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ పరకాలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మిస్తామని చెప్పారు.
పార్టీ సీనియర్ నాయకుడు చందుపట్ల జంగారెడ్డి మాట్లాడుతూ ఇంత ఎదురుగాలిలోనూ ధర్మారెడ్డి గెలుపొంది హీరోగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, భీముడి నాగిరెడ్డి, వజ్ర రవికుమార్, ప్రకాశరావు, మేకల రాజవీరు, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, దేవూనూరి మేఘనాథ్, కాంచం గురుప్రసాద్, మడికొండ ఆనంద్, పంచగిరి శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు ధార్మరెడ్డి సాయిబాబా, కుంకుమేశ్వర ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
పట్టణంలో వియోత్సవ ర్యాలీ
టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఆర్టీసీ డిపో నుంచి విజయోత్సవ, కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జీ డాక్టర్ విజయచందర్‌రెడ్డి తదితర నాయ కులు ప్రత్యేక వాహనంలో ర్యాలీగా స్వర్ణగార్డెన్ కు చేరుకున్నారు.