టీవీ రంగంలో స్మార్ట్ ఫోన్ కంపెనీల దూకుడు..!
కోల్ కత్తా : ఇప్పటివరకూ ధరల పోటీ కేవలం స్మార్ట్ ఫోన్లకే అనుకున్నాం.. కానీ టెలివిజన్ రంగంలోనూ ఈ పోటీ తెరలేవబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, చైనా లీ ఎకోలు భారత టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయట. చౌకైన ధరలకే ఈ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీవీ మార్కెట్లో టాప్ బ్రాండ్లగా ఉన్న శామ్ సంగ్, ఎల్ జీ, సోనీలకు పోటీగా.. వారికి సీరియస్ చాలెంజ్ లా ఈ దీపావళి కంటే ముందే మార్కెట్లోకి రావాలని రిలయన్స్ జియో, లీఎకో ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
లైఫ్ బ్రాండ్ కింద వివిధ స్క్రీన్ సైజుల్లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను రిలయన్స్ జియో త్వరలోనే ఆవిష్కరించబోతుందట. ప్రస్తుతం ఆ కంపెనీ 4జీ-ఎల్ టీఈ స్మార్ట్ ఫోన్లను కలిగిఉంది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో ఇవి అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. మూడు స్క్రీన్ సైజులు 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలను టీవీ సెట్లకు రిలయెన్స్ మార్గనిర్దేశనం చేస్తుందట.
హై డెఫినేషన్ 4కే స్క్రీన్లతో టీవీలను ప్రవేశపెట్టడంతో, జియో అప్ కమింగ్ 4జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా జోడించనుంది. 4జీ సర్వీసులతో టీవీలను వినియోగదారుల ముందుకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన మార్గమని... మార్కెట్లో అగ్రస్థానంలో నిలవడానికి చౌకైన ధరలను ఆఫర్ చేస్తామని కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు.
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న మరో బ్రాండ్ లీఎకో.. చౌకైన ధరల్లో వచ్చే నెల టీవీ మార్కెట్లోకి రాబోతుందట. ఎలాంటి లాభాలను ఆశించకుండా.. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అనుసరించిన వ్యూహంతోనే టీవీలనూ ప్రవేశపెడుతుందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. మన్నిక, ప్రత్యేకతలు దగ్గర అసలు రాజీ పడకుండా టీవీ సెట్లను ప్రవేశపెడతామని చైనీస్ కంపెనీ తెలుపుతోంది.