Related
-
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్పోర్టు చట్టంలోని సెక్షన్10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు. భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు. -
ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ వార్ష్నీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ దిగుబడులు రెట్టింపు చేయగల కొత్త వంగడాలు మరో ఐదేళ్లలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెట్టప్రాం త పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్) శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. ది ఇంట ర్నేషనల్ పీనట్ జినోమ్ ఇనిషియేటివ్(ఐపీజీఐ)లో భాగంగా వేరుశనగ మొక్క జన్యుక్రమ నమోదును పూర్తి చేయడం దీనికి కారణమని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఫలి తంగా పంట దిగుబడులను ఎక్కువ చేయగలగడంతోపాటు కరవును సైతం తట్టుకునే, గిం జల్లోని నూనె మోతాదును పెంచగల కొత్త వం గడాలను అభివృద్ధి చేయవచ్చునని వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసేందుకు పది పన్నెండేళ్లు పడుతుందని, జన్యుక్రమం అందుబాటులో ఉండటం వల్ల ఈ సమయం సగానికి తగ్గుతుందని ఆయన తెలిపారు. కరవును తట్టుకోగల కొన్ని వంగడాలను తామిప్పటికే సంప్రదాయ పద్ధతుల్లో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రైతులకు అందించామని అన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ దిగుబడులు హెక్టారుకు ఒక టన్నుకు మించడం లేదని... జన్యుక్రమాన్ని పరిశీలిస్తే 4 - 5 టన్నుల దిగుబడులూ సాధించగల సామర్థ్యం ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో దిగుబడులు కనీసం రెండు టన్నులకు పెంచగల వంగడాలను అభివృద్ధి చేయగలమని తాము గట్టి నమ్మకంతో ఉన్నామని చెప్పారు. పైగా ఈ కొత్త వంగడాలు జన్యుమార్పిడి పంటలు కావు కాబట్టి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. బొలీవియా మొక్క నుంచి... ప్రస్తుతం ఉపయోగిస్తున్న వేరుశనగ దక్షిణ అమెరికాలోని బొలీవియా నుంచి ప్రపంచమంతా విస్తరించినట్లు ఐపీజీఐ పరిశీలన ద్వారా స్పష్టమైంది. రెండు వేర్వేరు జాతుల మొక్కల సంకరం ద్వారా పుట్టిన వేరుశనగలో రెండు జన్యుక్రమాలు ఉన్నాయని డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ జన్యుక్రమంలో వచ్చిన మార్పులు కూడా తక్కువేనని పూర్వజాతులతో పోలిస్తే 99.96 శాతం జన్యుక్రమం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేవిడ్ బెర్టియోలీ అంటున్నారు. ఐజీపీఐలో ఇక్రిశాట్తోపాటు ఆరు దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.