relatives halchal
-
ఇంట్లోకి చొరబడి భర్తను చితకబాదారు
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య గొడవ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. భార్య తరపు బంధువులు భర్తను చితకబాదారు. ఈ ఘటన వనస్థలిపురంలో కాలనీలో వెలుగుచూసింది. వివరాలు.. చైతన్యరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్యతో తగాదా నేపథ్యంలో ఆమె తరపు బంధువులు వారి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. చైతన్యరెడ్డి, అతని తల్లి, వదినలపై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు బాధితుని ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడిలో గాయపడిన చైతన్యరెడ్డి తల్లి ఎల్బీనగర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని నెలలుగా చైతన్యరెడ్డికి అతని భార్య మధ్య గొడవలు అవుతున్న నేపథ్యంలో.. చైతన్యరెడ్డి తమ్ముడు అతని భార్యను ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధవులతో కలిసి దాడికి పూనుకున్నారు. గతంలో కూడా తనపై తన భార్య కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని చైతన్యరెడ్డి ఆరోపించారు. ఇరు వర్గాలు వనస్థలిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మితిమీరిన మంత్రి బంధువుల ఆగడాలు
రామగిరి: మంత్రి పరిటాల సునీత బంధువుల ఆగడాలు మండలంలో పెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న మంత్రిగారి బంధువైన ఓ కాంట్రాక్టర్కు లబ్ధిచేకూర్చేందుకు బాగున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత ఆ భవనానికి ఉన్న రూ.లక్షలు విలువజేసే రాళ్లను మరొక బంధువుకు కారు చౌకగా అప్పగించారు. మరో బంధువుకు సిమెంట్ గోడౌన్ కోసం బస్షెల్టర్ను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారం ఉంది.. అడిగేవారెవరు? అన్నరీతిలో రామగిరి మండలంలో మంత్రి బంధువులు, అనుచరులు చెలరేగి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు వారికి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అంటున్నారు. ఇక మంత్రిగారి సొంత పంచాయతీ నసనకోటలో ఇటీవల తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.2కోట్లతో పనులు చేపట్టారు. 4 బోరుబావులను ఇటీవలే తవ్వించారు. మిగిలిన ట్యాంకుల నిర్మాణం పైపులైన్ల ఏర్పాటు కొనసాగుతోంది. కొత్తగా తవ్విన బోరుబావుల్లో పుష్కలంగా నీరుపడింది. ఇక ఆలస్యమెందుకు అనుకున్నారో ఏమో ప్రభుత్వ బోర్ల నుంచి వచ్చే నీటితో గంగంపల్లికి చెందిన మంత్రి గారి ఇద్దరు బంధువులు 8 ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. వారి పంటలు పూర్తయ్యే వరకు నీటిని వదలాలని మంత్రే స్వయంగా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇక అడ్డేముంది యథేచ్ఛగా ప్రభుత్వ నిధులతో తమ పంటపొలాలకు పైపులు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేస్తున్నారు.