మితిమీరిన మంత్రి బంధువుల ఆగడాలు
రామగిరి: మంత్రి పరిటాల సునీత బంధువుల ఆగడాలు మండలంలో పెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న మంత్రిగారి బంధువైన ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధిచేకూర్చేందుకు బాగున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత ఆ భవనానికి ఉన్న రూ.లక్షలు విలువజేసే రాళ్లను మరొక బంధువుకు కారు చౌకగా అప్పగించారు. మరో బంధువుకు సిమెంట్ గోడౌన్ కోసం బస్‌షెల్టర్‌ను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారం ఉంది.. అడిగేవారెవరు? అన్నరీతిలో రామగిరి మండలంలో మంత్రి బంధువులు, అనుచరులు చెలరేగి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు.
వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు వారికి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అంటున్నారు. ఇక మంత్రిగారి సొంత పంచాయతీ నసనకోటలో ఇటీవల తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.2కోట్లతో పనులు చేపట్టారు. 4 బోరుబావులను ఇటీవలే తవ్వించారు. మిగిలిన ట్యాంకుల నిర్మాణం పైపులైన్ల ఏర్పాటు కొనసాగుతోంది. కొత్తగా తవ్విన బోరుబావుల్లో పుష్కలంగా నీరుపడింది. ఇక ఆలస్యమెందుకు అనుకున్నారో ఏమో ప్రభుత్వ బోర్ల నుంచి వచ్చే నీటితో గంగంపల్లికి చెందిన మంత్రి గారి ఇద్దరు బంధువులు 8 ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. వారి పంటలు పూర్తయ్యే వరకు నీటిని వదలాలని మంత్రే స్వయంగా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇక అడ్డేముంది యథేచ్ఛగా ప్రభుత్వ నిధులతో తమ పంటపొలాలకు పైపులు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేస్తున్నారు.