విస్తరణకు దారేదీ?
భూసేకరణే ప్రధాన అడ్డంకి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పలు ప్రధాన రహదారులను ఓ వైపు భూసేకరణ, మరో వైపు నిధుల కొరత వేధిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బ్రిడ్జీలకు భూ సేకరణతో పాటు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో రోడ్ల విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. రోడ్లను విస్తరించడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో నిర్మించాల్సిన హైలెవెల్ బ్రిడ్జీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు అవసరమైన భూములను సేకరించడంలో పలుచోట్ల ఏర్పడిన సమస్యల వల్ల పనులు కాస్తా ఆగిపోవడం... తద్వారా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి భూ సేకరణ సమస్యతో ఏకంగా జాతీయ రహదారుల ఏర్పాటులో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇన్ని రోజులుగా జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎస్ఆర్ పనులకు విడుదల కాని నిధులు...
జిల్లాలోని పలు రోడ్లకు సంబంధించి స్పెషల్ రిపేర్స్ ప్రోగ్రాం (ఎస్ఆర్) కింద రూ.26 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినా, ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఎస్ఆర్ పథకం కింద ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వరకు చేపట్టాల్సిన పనులకు రూ.1.10 కోట్లు, చిన్నహుల్తి నుంచి బిల్లేకల్లు వరకు రూ.2 కోట్లు, ఆస్పరి నుంచి ఆలూరు వరకు రూ.1.70 కోట్లు, ప్యాపిలి నుంచి బనగానపల్లె వరకు రూ.2 కోట్లు, బనగానపల్లె నుంచి పాణ్యం వరకు రూ.2 కోట్లు, ఎమ్మిగనూరు నుంచి మాలపల్లి, కోసిగి వరకు రూ.1.70 కోట్లు, నంద్యాల నుంచి బూజనూరు వరకు రూ.1.85 కోట్లు, నంద్యాల నుంచి నందికొట్కూరు వరకు రూ.1.70 కోట్లు, పెంచికలపాడు నుంచి గూడూరు మీదుగా ఎమ్మిగనూరు వరకు రూ.1.80 కోట్లు, వెల్దుర్తి నుంచి ఈదుల దేవరబండ వరకు రూ.2 కోట్లు, వెలుగోడు నుంచి మిడ్తూరు మీదుగా గార్గేయపురం వరకు రూ.2 కోట్లు, అనుగొండ నుంచి లక్ష్మిపురం వరకు రూ.1.85 కోట్లు అవసరమవుతాయని పంపిన ప్రతిపాదనలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు.
అటకెక్కిన రూ.290 కోట్ల ప్రతిపాదనలు
జిల్లాలోని ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపి కూడా నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలనా అనుమతులు రాలేదు. ఈ పనులకు సంబంధించి రూ.290 కోట్లు అవసరమవుతాయని నివేదికలు ప్రభుత్వానికి పంపారు. అయితే, తాజా బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లకు మించి కేటాయింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణపు పనులు పూర్తయ్యేందుకు మరో పది సంవత్సరాలు పడుతుందన్నమాట.
భూసేకరణ, నిధుల లేమితో జాప్యం జరుగుతున్న పనులు!
డోన్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి
బస్తిపాడు దగ్గర హంద్రీనదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జీ
నందికొట్కూరులో బైపాస్ రోడ్డు
నంద్యాల పట్టణంలో నుంచి ఆత్మకూరు రోడ్డుకు బైపాస్
నంద్యాల- ఆత్మకూరు రోడ్డులో ఆర్ఓబీ నిర్మాణం
భీమునిపాడు- ఆర్ జంబుదిన్నె రోడ్డులో హై లెవెల్ బ్రిడ్జీ
నంద్యాల- కోడూరు రోడ్డు
నాగులదిన్నె సమీపంలో తుంగభద్ర నదిపై హై లెవెల్ బ్రిడ్జీ
ఆదోనిలో ఆర్ఓబీ నిర్మాణం