సినిమా రిలీజంటే ఇప్పటికీ ఆయనకు దడే!
రజనీకాంత్ సినిమా అనగానే కోట్లల్లో ఖర్చు, అందుకు కొన్ని పదుల రెట్లలో వసూళ్ళు వస్తాయని సినీ వర్గాలు భావిస్తాయి. బాక్సాఫీస్ బాద్షాగా పేరున్న రజనీకాంత్‌కు మాత్రం అందరి లానే తన కొత్త సినిమా విడుదలవుతోందంటే ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందోనని ఇప్పటికీ కాస్తంత ఆందోళన చెందుతుంటారట. సాక్షాత్తూ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఈ మాట చెప్పారు. చాలా ఏళ్ళ విరామం తరువాత మళ్ళీ తన సినిమా విడుదలవుతుండడంతో, ఈ సూపర్‌స్టార్ మానసిక స్థితి ఇప్పుడు అచ్చం అలానే ఉందట.
దీర్ఘకాలం శ్రమించి, కొన్ని పదుల కోట్ల రూపాయల పెట్టుబడితో తయారైన ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె ఈ మాట బయటపెట్టారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల మళ్ళీ వాయిదాపడిందంటూ వస్తున్న వార్తలను లత ఖండించారు. ‘‘అవన్నీ వట్టి గాలి వార్తలు. అంతా సాఫీగా సాగుతోంది. అనుకున్నట్టుగానే ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది’’ అని ఆమె చెప్పారు. ‘‘తాను నటించిన కొత్త సినిమా రిలీజవుతోందంటే, ఆయనకు ఇప్పటికీ గుండె దడే! ఆందోళన పడుతుంటారు, ఉద్విగ్నతకు లోనవుతుంటారు. ఇప్పటికీ సినీ రంగంలో తాను ఓ విద్యార్థిననే ఆయన భావిస్తారు’’ అని లత చెప్పుకొచ్చారు.
2011లో రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి పాలైన సందర్భాన్ని గుర్తు చేసినప్పుడు, ‘‘అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంటిల్లపాదీ అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. దాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ఇక్కడ ఎంతో మంది అభిమానులు, ఆత్మీయులు ఉన్నప్పటికీ, కేవలం ఏకాంతం కోసమే విదేశానికి వెళ్ళి, చికిత్స చేయించాం. ఇక్కడ ఇంతమంది దృష్టి మీద పడుతుండడంతో, పరిస్థితులను అదుపులో పెట్టడం తమ వల్ల కాదంటూ, సాక్షాత్తూ డాక్టర్లే చికిత్స కోసం మమ్మల్ని విదేశాలకు వెళ్ళమన్నారు. చికిత్స పూర్తయి వెనక్కి వచ్చాక కూడా, మిగిలిన సంగతులన్నీ పక్కనపెట్టి, ముందుగా అన్నీ కుదురుకొనేలా చూసుకోవాలనుకున్నాం. వాస్తవాన్ని అంగీకరిస్తూ, మళ్ళీ అంతా కొత్తగా ఆరంభించాలనుకున్నాం’’ అని రజనీకాంత్ సతీమణి వివరించారు. ‘‘దేవుడి దయ, అభిమానుల ప్రార్థనల వల్ల ఇప్పుడు ఆయన బాగున్నారు. మునుపటి కన్నా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు’’ అని వివరించారు.
మునుపెన్నడూ చూడని అంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తూ, భారతీయ సినీసీమలో చరిత్రాత్మకంగా నిలిచే సినిమా ఇదని లత అభిప్రాయపడ్డారు. ‘‘అందుకే, ఈ సినిమాను ఆరు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నా, అదీ తక్కువే అనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు. ‘అవతార్’ తరహా సినిమాను అందులో కేవలం నాలుగో వంతైనా లేని పరిమిత బడ్జెట్లో, పరిమిత సమయంలో తీయడం ఓ పెద్ద సవాలుగా నిలిచిందని ఈ చిత్రంలో స్వయంగా పాట కూడా పాడిన లతా రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలోని ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే, మరొక్క వారం రోజులు ఆగాల్సిందే!