పునఃసమీక్ష!
సాక్షి, చెన్నై : రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల కోసం మరో ప్రయత్నంగా పునఃసమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. వారి విడుదలను కాంక్షిస్తూ గత తీర్పు పునఃసమీక్షకు పట్టుబట్టే పనిలో అమ్మ సర్కారు నిమగ్నమైంది. కేంద్రం ఆలోచనను స్వీకరించాలే గానీ, అనుమతి అవసరం లేదని ఆ పిటిషన్లో స్పష్టం చేశారు.మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శాంతన్, మురుగన్, పేరరివాలన్, నళినిలతో పాటు ఏడుగురు ఏళ్ల తరబడి వేలూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
వీరి ఉరి శిక్ష యావజ్జీవంగా మారింది. అయితే, యావజ్జీవం కన్నా, ఎక్కువగానే వీరు జైలు జీవితాన్ని అనుభవించి ఉన్నారన్న వాదనలు తెర మీదకు రావడంతో విడుదల నినాదం ఊపందుకుంది. ఈ ఏడుగురి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తూ వస్తున్నది. వారి విడుదల వ్యవహారంలో కేంద్రం ఆలోచన స్వీకరించేందుకు తగ్గ కసరత్తులు జరిగాయి. గత ఏడాది ఆ ఏడుగురిని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని రాజకీయ శాసనాల బెంచ్ విచారించి, కేసు విచారణను సీబీఐ సాగించి ఉన్న దృష్ట్యా, ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఏడుగురి విడుదల మళ్లీ వెనక్కు వెళ్లింది. ఆ ఏడుగురిని విడుదల చేయించడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న అమ్మ జయలలిత ప్రభుత్వం మరో మారు తీర్పును పునఃసమీక్షించే విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అనుమతి అవసరం లేదు : రాష్ర్ట ప్రభుత్వం తరఫున బుధవారం సుప్రీంకోర్టులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలైంది. రాజీవ్ హత్య కేసు నిందితుల గురించి వివరిస్తూ, 25 ఏళ్లకు పైగా వారు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నట్టు గుర్తుచేశారు. వారి విడుదలకు కేంద్రం ఆలోచనను స్వీకరించాల్సిన అవసరం ఉందే గానీ, అనుమతి తప్పనిసరి కాదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అందులో వివరించారు. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని సూచించారు. రాజకీయ శాసనాల బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి, ఆ ఏడుగురి విడుదలకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.