దేశీయ ఐటీరంగానికి ట్రంప్ ఒక వరం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత ఐటీ పరిశ్రమపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐటీ పరిశ్రమ హానికరమైనవిగా అందరూ భావిస్తోంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మరోలా స్పందించారు. వాస్తవానికి ట్రంప్ విధానాలు, చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలే దేశీయ ఐటీ పరిశ్రమకు వరం లాంటివని వ్యాఖ్యానించారు. ఆందోళల్ని పక్కనపెట్టి దేశీయ ఐటీ వృద్ధికి కృషిచేయాలని ఆయన ఐటీ పరిశ్రమను కోరారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా ముకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ విధానాలు మరో రూపంలో ఐటీ పరిశ్రమకు సాయం చేస్తున్నట్టే అని చెప్పారు. దేశీయ ఐటీ మార్కెట్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో దేశంలోని ఐటీ సమస్యలను పరిష్కరించడంలో భారత ఐటి పరిశ్రమ దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఆలోచనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచం గోడలు నిర్మించాలని ఆలోచిస్తుండొచ్చు..కానీ దానికి ఇండియా ప్రభావితం కావాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం ద్వారాలు తెరిచే ఉండాలన్నారు.