తేజ్పాల్ అరెస్టు.. అంతలోనే కోర్టు నుంచి ఊరట
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు వెంటవెంటనే రెండు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. గోవాలో అడుగు పెట్టగానే ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రేపు ఉదయం 10 గంటలకు తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని, ఆ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో తేజ్పాల్కు ఒక్క రోజుకు మాత్రం ఊరట దొరికినట్లు అయ్యింది. బెయిల్ ఇచ్చేదీ లేనిదీ తేలిపోతుంది కాబట్టి ఆ తర్వాత అరెస్టు విషయాన్ని కూడా చూసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు.
అంతకుముందు వీలైనంత వరకు అరెస్టును తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నించిన తేజ్పాల్.. చివరకు గోవాకు విమానంలో బయల్దేరక తప్పలేదు. దాంతో ఆయన విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే అప్పటికే సిద్ధంగా ఉన్న గోవా పోలీసులు అరెస్టు చేశారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించడంతో తేజ్పాల్ మీద కేసు నమోదైన విషయం తెలిసిందే.
అయితే, విచారణ సమయంలో తేజ్పాల్ తరఫున వాదిస్తున్న న్యాయవాది బాధితురాలి పేరును ఉదహరించారు. వెంటనే దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు న్యాయవాది ఎలా అయ్యావంటూ జడ్జి చీవాట్లు పెట్టారు.