'చంద్రబాబు అపచారం చేశారు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతవిశ్వాసాలపై నమ్మకం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు అపచారం చేశారని, ఆయన తీరు రాష్ట్రానికి అరిష్టమని ధ్వజమెత్తారు.
ఐదు రోజుల క్రితం చంద్రబాబు పెదనాన్న కొడుకు మరణించడంతో, ఈ నెల 15న జరగాల్సిన ఆయన మనవడి పుట్టివెంట్రుకల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెవిరెడ్డి చెప్పారు. కర్మక్రియలు పూర్తయ్యే వరకు శుభకార్యాలు చేయరని, దేవాలయాలకు వెళ్లరని.. అలాంటిది అమరావతిలో రాజధాని శంకుస్థాపన కోసం చంద్రబాబు నాగదేవత పూజలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. తన ఇంట్లో శుభకార్యాన్ని రద్దు చేసుకున్న చంద్రబాబు.. ప్రభుత్వ పూజా కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని చెవిరెడ్డి నిలదీశారు. మతపెద్దలు ఈ విషయంపై చంద్రబాబును ప్రశ్నించాలని కోరారు.