పైరవీల్లో ఎంపీడీవోలు
- పోస్టింగ్‌ల్లో జాప్యం
- కొనసాగుతున్న గందరగోళం
కరీంనగర్ సిటీ : జిల్లాలో ఎన్నికల బదిలీలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న 33మంది ఎంపీడీవోలు సాధారణ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీవోలు విధుల్లో చేరారు. ఎన్నికలు ముగిసి, కోడ్ ఎత్తివేశాక ఎక్కడ పనిచేసే ఎంపీడీవోలను అదే స్థానంలోకి పంపించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీ అయి పదిహేనురోజులు గడుస్తున్నా జిల్లాలో ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ పూర్తికాలేదు.
ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించక కొందరు, ఇతర జిల్లాల నుంచి రిలీవ్ ఆర్డర్ పొందక మరికొందరి బదిలీలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా కొంతమంది తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం పైరవీలు తీవ్రతరం చేశారు. జిల్లాలో ఉన్న 33 మంది ఎంపీడీవోలు బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లగా, అందులోనుంచి 25 మంది జిల్లాకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన వారు అక్కడ రిలీవ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఇంకారాలేదని అధికారులు తెలిపారు. జిల్లాకు వచ్చినవారి పోస్టింగ్‌లు ఇవ్వడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పరిపాలనాపరంగా కొంతమంది స్థానాలు మారిపోయాయి.
కరీంనగర్ ఎంపీడీవోగా ఉన్న దేవేందర్‌రాజును ఎలిగేడుకు బదిలీ చేయగా.. ఆయన విధుల్లో చేరలేదు. ఆయన స్థానంలో కరీంనగర్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. బె జ్జంకి స్థానం నుంచి ఓబులేశ్ బదిలీపై వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేసరికి ఆ స్థానం ఖాళీలేకపోవడంతో ముస్తాబాద్‌కు పోస్టింగ్ మార్చారు. గతంలో డ్వామాలో పనిచేసిన కుమారస్వామికి బెజ్జంకిలో పోస్టింగ్ ఇచ్చారు. రెండు మండలాలకు సంబంధించిన ఇతర జిల్లాల ఎంపీడీవోలను అధికారులు రిలీవ్ చేయడంలేదు.
ఇటీవల ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేయడంతో ఆ డబ్బులు రికవరీ చేయాల్సిందేనని ఆదేశించారు. అప్పటివరకు ఆయా స్థానాల నుంచి రిలీవ్ చేసేదిలేదని తేల్చిచెప్పడంతో ఆ రెండు పోస్టింగ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. మరో ఎనిమిది స్థానాలు ఖాళీ ఉండడంతో కొంతమంది తమకు అనువైన స్థానాల కోసం పైరవీలు మొదలుపెట్టారు. అధికారపార్టీల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొంతమంది తమను అక్కడినుంచి బదిలీ చేయరాదంటూ ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు.
ఎంపీడీవోల పోస్టింగ్‌ల ప్రక్రియ పూర్తికాకపోవడం జిల్లా పాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడిపోయింది. మొత్తానికి ఎంపీడీవోల పోస్టింగ్‌ల్లో విపరీతమైన జాప్యం, పైరవీలకు, పరిపాలనాపరమైన ఇబ్బందులకు కారణమవుతోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎంపీడీవోల పోస్టింగ్‌ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి గందరగోళానికి ముగింపు పలకాల్సిన అవసరముంది.