Remand inmate
-
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆ విషయాన్ని గురువారం ఉదయం జైలు సిబ్బంది గుర్తించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గంజాయి అక్రమ రవాణా కేసులో మూడు రోజుల కిందటే ఖైదీ సత్యనారాయణరెడ్డి (38) అరెస్ట్ చేసినట్లు జైళ్లు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఖైదీ మృతిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. -
పోలీస్ ఎస్కార్ట్ నుంచి రిమాండ్ ఖైదీ పరార్
రాజమండ్రి : పోలీసు ఎస్కార్ట్ నుంచి శ్రీనివాసులు అనే రిమాండ్ ఖైదీ తప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన రాజమండ్రిలో షెల్టన్ హోటల్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై శ్రీనివాసులును రాజమండ్రి నుంచి కడప జిల్లా కోర్టుకు తరలించారు. కోర్టులో హజరుపరిచి తిరిగి రాజమండ్రి తీసుకువస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పిన శ్రీనివాసులు... పోలీసులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పలాయనం చిత్తగించాడు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): హత్య కేసులో విచారణ ఎదుర్కొంటూ ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీ సోమవారం ఇనుప రేకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు సూపరింటెండెంట్ డి.రాఘవేంద్రరావు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన యమ్మిగంటి వీరవెంకట వరప్రసాద్ దాదాపు రెండేళ్ల క్రితం సొమ్ము కోసం అమ్మమ్మను హత్య చేసినట్టు కేసు నమోదైంది. తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు హత్యను కళ్లారా చూసిన ఐదేళ్ల చిన్నారిని సైతం హతమార్చినట్టు అభియోగం ఎదుర్కొంటున్నాడు. విజయవాడ పోలీసులు అత న్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయవాడ జైలులో ఖాళీ లేకపోవడంతో పోలీసులు నిందితుడిని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిందితుడు వరప్రసాద్ 18నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సోమవారం విజయవాడలోని మహిళా కోర్టులో విచారణ నిమిత్తం హాజరుకావాల్సి ఉండగా, తనకు జైలు శిక్ష తప్పదనే భయంతో ఉదయం బాత్రూమ్ డోర్ రేకుతో వరప్రసాద్ గొంతుకోసుకున్నాడు. జైలు సిబ్బంది అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.