రిమోట్ విమానం కోసం గాలింపులు
చెన్నై : గ్రానైట్ క్వారీ పల్లపు గుంతలో పడిన రిమోట్ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మదురై పరిసర ప్రాంతాల్లో ఐఏఎస్ అధికారి సహాయం విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఆయన క్వారీల్లో తనిఖీలు జరిపేందుకు మానవ రహిత రిమోట్ విమానాన్ని ఉపయోగించారు. ఈ క్రమంలో ఈ విమానం అదుపుతప్పి హఠాత్తుగా సోమవారం క్వారీ గుంత నీటిలో పడిపోయింది. ఈ గుంత నీటిలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
అయినప్పటికీ సోమవారం రాత్రి చీకటి పడడంతో గాలింపు సాధ్యం కాలేదు. మంగళవారం నీటిలో దిగి సిబ్బంది గాలింపులు జరిపారు. గుంత దిగువ భాగాన బురదమయంగా ఉండడంతో రిమోట్ విమానాన్ని వెదకడం కష్ట సాధ్యంగా మారింది. దీంతో దీన్ని ఎలాగైనా వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రైనేట్ క్వారీల విచారణ అధికారి సహాయం సోమవారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. రెండవ రోజుగా గాలింపు చర్యల్లో ఉన్న సిబ్బందికి అధికారులు సహ కరిస్తున్నారు.