సర్కోమా కేన్సర్‌కు కొత్త చికిత్స
న్యూఢిల్లీ: సర్కోమా కేన్సర్ రోగులకు శుభవార్త. బంధన కణజాలాల కేన్సర్ చికిత్సలో అవయవాల తొలగింపునకు ప్రత్యామ్నాయాన్ని ఢిల్లీలోని అఖిల భారతవైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు కనుగొన్నారు. సర్జరీలో 10 సెంమీలను మించిన ట్యూమర్ల తొలగింపు వల్ల ఆ భాగంలోని రక్తనాళాలను కూడా తొలగించాల్సి వచ్చేది. దాంతో, పూర్తిగా ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడేది. సర్జరీ అనంతరం అవయవాల తొలగింపు వల్ల బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించేందుకు ఎయిమ్స్ వైద్యులు నడుం కట్టారు.
ప్రభావిత భాగాన్ని రక్తనాళాలతో సహా తొలగించి.. ఆ తరువాత, తిరిగి రక్తనాళాలను కృత్రిమంగా పునరుద్ధరించడం ద్వారా.. ప్రభావిత అవయవాన్ని తొలగించకుండా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నట్లుగా ఎయిమ్స్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా ఆదివారం వెల్లడించారు. తొడ వద్ద 12 సెంమీల సర్కోమా కేన్సర్‌తో బాధపడ్తున్న బిహారీ యువకుడికి ఈ విధానం ద్వారా చికిత్స చేశామన్నారు. సాధారణ చికిత్సలో అయితే, కాలు తీసేయాల్సి వచ్చేదన్నారు.