ఈ సింగ్.. రియల్ హీరో
మత విశ్వాసాల కంటే ఓ ప్రాణిని రక్షించడమే మిన్న అని భావించాడు. అసాధారణ రీతిలో సాహసం చేసి పునర్జన్మ ఇచ్చాడు. పంజాబ్‌కు చెందిన శర్వాణ్ సింగ్ (28).. రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.
శర్వాణ్ స్నేహితులతో కలసి కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన కొంతమంది నిల్చుని కాలువవైపు చూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని శర్వాణ్ కారు ఆపి జనం దగ్గరికి వెళ్లి చూశాడు. నదిలో పడిన ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. బయటకు రాలేక మృత్యువుకు దగ్గరవుతోంది. జనం ఆ దృశ్యాన్ని చూస్తున్నారు కానీ ఆ కుక్కను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.
శర్వాణ్‌కు ఈత రాదు. అయినా కుక్కను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాడు. సిక్కు మతవిశ్వాసాలకు పవిత్రంగా భావించే తలపాగా తీశాడు. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. శర్వాణ్ అవేమీ పట్టించుకోలేదు. తలపాగాను తాడుగా చేసుకుని ఓ అంచును పట్టుకోమని స్నేహితులకు ఇచ్చి.. మరో అంచును పట్టుకుని వారి సాయంతో కాలువలోకి ఏటవాలుగా దిగాడు. అయితే నీళ్లల్లో నుంచి కుక్కును బయటకు తీసుకురావడానికి శ్రమించాల్సి వచ్చింది. మరో గుడ్డను తీసుకుని దాన్ని సాయంతో కుక్కను కాలువపైకి తీసుకువచ్చాడు. కుక్క బాగా నీరసించిపోయింది. సింగ్ తన దగ్గరున్న బిస్కెట్లు దానికి అందించాడు. కాసేపటి తర్వాత కోలుకున్న కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన శ్రమ ఫలించినందుకు సింగ్ సంతోషపడ్డాడు.
సిక్కు మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో లేదా స్నానం చేసేటపుడు మాత్రమే తలపాగా తీయాలి. ఆ సమయంలో కుక్క ప్రాణాలను రక్షించడమే ప్రధానమని భావించానని శర్వాణ్ సింగ్ చెప్పాడు.