ఐసిస్ నుంచి మరో భయానక వీడియో
బందీలను కాల్చి చంపిన ఐసిస్ ఉగ్ర బాలలు
లండన్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు చెందిన ఐదుగురు బాలురు సిరియాలో తమ వద్ద బందీలుగా ఉన్న కుర్దిష్ తిరుగుబాటు దారులను దారుణంగా కాల్చి చంపారు. ఆ భయంకర వీడియోను ఐసిస్ విడుదల చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుర వయసు సుమారు 10 -13 ఏళ్లు ఉంటుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న క్యాప్షన్ ఆధారంగా బాలురలలో ఒకరు యూకేకు చెందిన వాడుగా.. అతని పేరు అబు అబ్దుల్లా ఆల్ బ్రిటాని అని తెలియవస్తుంది. మిగిలిన నలుగురు బాలురు ట్యునీషియన్, కుర్దిష్, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.
వీడియోలో బ్రిటన్‌కు చెందిన అబు మాట్లాడుతూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఇలా ఎవరి సహకారంతో అయిన కుర్దులను ఎవరూ కాపాడలేరని అరబిక్ భాషలో పేర్కొన్నాడు. బందీలను మోకాళ్లపై ఉంచి చంపడానికి ముందు గాలిలోకి పిస్తోళ్లను ఉంచి ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్) అని గట్టిగా నినాదాలు చేశారు. సదరు బ్రిటిష్ బాలుడి గురించి యూకే విదేశీ వ్యవహారాల కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా, ఆ బాలుడు బ్రిటిష్ మహిళకు జన్మించి ఉంటాడని, పదేళ్ల వయసులో ఐసిస్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. బాలుడి పేరును తన తండ్రి పేరు నుంచి తీసుకుని ఉంటారని అనుకుంటున్నారు. అతని తండ్రి ఒక బ్రిటిష్ ఉగ్రవాదిగా, సిరియాలో పెళ్లి చేసుకున్నట్లుగా, అమెరికా చేపట్టిన వైమానిక దాడిలో అతడు చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.