అద్దెకిచ్చిన ఇంటిని అమ్మేశారు
పన్ను చెల్లింపు సమయంలో వెలుగుచూసిన వివాదం
తహసీల్దార్, పోలీసులను ఆశ్రయించిన యజమానులు
వాకలపూడి (కాకినాడ రూరల్):
ఇంట్లో అద్దెకు దిగి ఆ ఇంటినే ఇతరులకు అమ్మేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు యజమానులు శనివారం వారి ఇంటి ఎదుటే ఆందోళనకు దిగి అనంతరం తహసీల్దార్‌ను, సర్పవరం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ మండలం వాకలపూడి ఎస్సీ పేటలో సుందరపల్లి అనితకు 2–135 నంబరు గల డాబా ఇల్లు ఉంది. దీన్ని రెండేళ్ల కిత్రం ఉప్పులూరి విజయశేఖర్ అనే ఫైనా¯Œ్స వ్యాపారికి అద్దెకు ఇచ్చి ఇంటిపై రూ.లక్ష అప్పుగా తీసుకొని, ప్రభుత్వం ఇచ్చిన పట్టాను ఆయన దగ్గర పెట్టారు. తీసుకున్న రుణానికి వడ్డీ కింద, ఇంటి అద్దె తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కాల్‌మనీ కేసుల్లో ఇరుకున్న విజయశేఖర్ తప్పించుకుని తిరుగుతున్నాడని, ఆ సమయంలో తన డబ్బు తనకిచ్చేస్తే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పడంతో అనిత తీసుకున్న రూ. లక్ష ఫైనా¯Œ్స వడ్డీ వ్యాపారి విజయశేఖర్కి అందించినట్లు, తాకట్టుగా పెట్టిన పట్టాను తరువాత ఇస్తానని నమ్మబలికాడని, ఆతరువాత తమ ఇంటిని వేరే వ్యక్తులకు విక్రయించి పరారై వెళ్లిపోయినట్లు అనిత కుటుంబ సభ్యులు వివరించారు. గత ఏడాది వరకు ఇంటి పన్ను తమ పేరుతోనే కట్టామని, ఈ ఏడాది ఇంటిపన్ను కట్టేందుకు పంచాయతీకి వెళ్లగా మీ ఇల్లు ఎవరో కొనుగోలు చేసుకున్నట్లు వచ్చి దస్తావేజులు ఇచ్చి ఇంటిపన్ను మార్పించుకున్నారని చెప్పడంతో తాము అవాక్కాయ్యామని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టా ప్రకారం 190 సర్వేనంబరులో ఉండగా, విజయశేఖర్ 193/1 సర్వేనంబరు వేసి మరో వ్యక్తికి విక్రయించారని, వారు తమ ఇంట్లో ఉంటూ ఖాళీ చేయనని చెబుతున్నారని బాధిత కుటుంబసభ్యులు వివరించారు. తాము ఇద్దరు ఆడపిల్లలతో ఉంటున్నామని, తమకు ఈ ఇల్లే దిక్కని, తమకు అధికారులే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై విచారణ చేయిస్తామని తహసీల్దార్ జె సింహాద్రి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.