Renuka Sugars
-
దుమ్మురేపిన మార్కెట్
ఇటీవల కన్సాలిడేషన్ దిశలో కదలుతున్న మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ గత పది రోజుల్లోలేని విధంగా 319 పాయింట్లు ఎగసింది. తొలిసారి 24,500కు ఎగువన 24,693 వద్ద నిలిచింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 91 పాయింట్లు పురోగమించి 7,400 సమీపాన 7,367 వద్ద స్థిరపడింది. ఇవి కొత్త గరిష్ట స్థాయి ముగింపులుకాగా, బ్యాంకింగ్, విద్యుత్, ఆయిల్, రియల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2% మధ్య బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ నామమాత్రంగా నష్టపోయింది. మోడీ అధ్యక్షతన బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్, ఇన్ఫ్రా, తయారీ, బ్యాంకింగ్ తదితర రంగాలకు జోష్‌నిచ్చేందుకు పటిష్ట చర్యలను చేపడుతుందన్న అంచనాలు ఆయా రంగాల షేర్లకు డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలు, మెరుగుపడనున్న పెట్టుబడి వాతావరణం కారణంగా వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి 6.5%కు పుంజుకుంటుందన్న అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ వెలువరించడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల జోష్ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ ఏకంగా 10% జంప్‌చేయడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 18,000 కోట్లకుపైగా ఎగసి రూ. 2,05,700 కోట్లకు చేరింది. షేరు ఇంట్రాడేలో మూడేళ్ల గరిష్టం రూ. 2,775ను తాకి చివరికి రూ. 2,755 వద్ద ముగిసింది. ఈ బాటలో కెనరా బ్యాంక్ 13% దూసుకె ళ్లగా, ఓబీసీ, ఆంధ్రా, సెంట్రల్, సిండికేట్, కార్పొరేషన్, అలహాబాద్ బ్యాంక్‌లతోపాటు బీవోఐ, పీఎన్బీ, బీవోబీ 9-3% మధ్య లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెసాస్టెరిలైట్, భెల్, భారతీ, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకోగా, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ 2-5% మధ్య నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రూ. 650 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 417 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లకు డిమాండ్ యథాప్రకారం చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో రెయిన్, కోల్టే పాటిల్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, బజాజ్ హిందుస్తాన్, అశోక్ లేలాండ్, స్పైస్‌జెట్, టాటా టెలీ, జిందాల్ సౌత్, జైన్ ఇరిగేషన్, ఐఎఫ్సీఐ, సుజ్లాన్, ల్యాంకో ఇన్ఫ్రా, మహీంద్రా హాలిడే, నాల్కో, అడ్వాంటా, ఐఐఎఫ్ఎల్, హిందుస్తాన్ జింక్, బీఏఎస్ఎఫ్, బాంబే డయింగ్, బాల్మర్ లారీ, మోనట్ ఇస్పాత్, పుంజ్లాయిండ్, పొలారిస్ ఫైనాన్షియల్ 20-7% మధ్య జంప్ చేశాయి. -
కార్మికుల నోట్లో మట్టి కొట్టిన ’బాబు’
‘అనంత’లో పరిశ్రమలన్నీ ఆయన హయాంలోనే మూత వైఎస్ హయాంలో పరిశ్రమలకు పునరుజ్జీవం సాక్షి, అనంతపురం : నిత్యం కరువు కాటకాలతో సతమతమవుతున్న జిల్లా ప్రజలు ఆర్థికంగా ఎదుగటానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ృషి చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న పరిశ్రమలను కూడా మూసేసి కార్మికుల నోట్లో మట్టికొట్టారు. దీంతో కార్మికులందరూ రోడ్ల మీద పడి జీవనోపాధి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి కుటుంబాలకు దూరమయ్యారు. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంట వద్ద దాదాపు 56 పరిశ్రమలు నెలకొల్పితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించకపోవడంతో వాటిలో దాదాపు 40 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. పరిగి వద్ద దాదాపు 150 ఎకరాల్లో ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని అతి తక్కువ ధరకు బెంగళూరుకు చెందిన రేణుక షుగర్స్‌కు కట్టబెట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించకూడదని అప్పట్లో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో గట్టి బందోబస్తు మధ్య ఫ్యాక్టరీలో వున్న పెద్ద పెద్ద యంత్రాలు తరలించేందుకు చంద్రబాబు సహకరించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పరిశ్రమలను మూయించి ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు. జిల్లాలో అక్కడక్కడ ఉన్న పరిశ్రమలను చంద్రబాబు హయాంలో ఒక్కొక్కటిగా మూసేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, పరిగి వద్ద వున్న చక్కెర ఫ్యాక్టరీ, మళుగూరు వద్ద ఉన్న ఐరన్ ఫ్యాక్టరీ, అనంతపురం శివారులో 23 ఎకరాల్లో వున్న డాల్డా ఫ్యాక్టరీ, ఏపీ లైటింగ్, పెనుకొండ వద్ద ఆల్విన్ కంపెనీ, రామగిరిలో బంగారు గనుల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక హిందూపురం నియోజకవర్గం తూముకుంట వద్ద ఉన్న 56 పరిశ్రమల్లో ప్రస్తుతం అక్కడున్న వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. కేవలం నీటి సదుపాయం లేకపోవడంతోనే పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుసుకొని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున పీఏబీఆర్ డ్యాం నుంచి పైప్‌లైన్ వేసి పరిశ్రమలకు నీళ్లు ఇచ్చేందుకు ృషి చేశారు. దీంతో బాబు హయాంలో మూత పడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకునే సమయంలో వైఎస్ వృతి చెందారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం తిరిగి అదే పరిస్థితి నెలకొంది. పరిశ్రమల మూతతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడటం కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15 వేల మంది కార్మికులు ఉన్నట్లుండి ఉపాధి కోల్పోయారు. గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు మూత పడటంతో ఉపాధి లేక దాదాపు 20 వేల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. పెనుకొండలో వున్న ఆల్విన్ కంపెనీ మూత పడటంతో దాదాపు 3 వేల మంది ఉపాధి కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుంటే కనీసం నూనె ఉత్పిత్తి కర్మాగారాలు ఏర్పాటు చేయడంలో కూడా పాలకులు శ్రద్ధ చూపలేక పోయారు.