కొన్ని రోడ్లకే మరమ్మతులు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామీణ రోడ్ల మరమ్మతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సంవత్సరాల తరబడి మరమ్మతులకు నోచుకోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని తారు రోడ్లకు 13వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను మంజూరు చేశారు. జీవో నెంబర్ పీఆర్ 2112 తేది 21-12-2013 ద్వారా బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా అనేక పంచాయతీ రాజ్ రోడ్లకు బీటీ మరమ్మతులు చేయాల్సి ఉండగా కేవలం ఎంపిక చేసిన 21 రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేసిన ప్రతిపాదనలకు 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 8.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు గాను ఎనిమిది నియోజవర్గాల పరిధిలోని 13 ప్రధాన మంత్రి గ్రామీణ సడాక్ యోజన పథకం కింద నిర్మించిన బీటీ రోడ్లకు, మరో ఎనిమిది గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ నుంచి బద్దం వాడ మీదుగా కరీంనగర్‌కు వెళ్లే రోడ్డు వరకు బీటీ మరమ్మతుల కోసం రెండు ప్రతిపాదనలకు మోక్షం లభించింది. ఒక బిట్టుకు రూ. 33 లక్షలు, మరో బిట్టుకు రూ. 45 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే ఇదే మండలంలోని దోంచంద, కరీంనగర్ జిల్లా కోమటి కొండాపూర్ రోడ్డు బీటీ మరమ్మతులకు రూ. 70 లక్షలు, ధర్మోరా, వన్నెల్(బీ) రోడ్డు బీటీ మరమ్మతులకు రూ. 71 లక్షలను మంజూరు చేశారు.
మోర్తాడ్ మండలంలోనే వడ్యాట్, చౌట్పల్లిల రోడ్డు మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తొర్తి రోడ్డుకు బీటీ మరమ్మతులు జరుగక పోవడంతో రోడ్డు పూర్తిగా చెడిపోయింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కిలో మీటరు ప్రయాణానికి వాహనాలపై పది నిమిషాల సమయం పడుతుంది. భీమ్‌గల్, బాల్కొండ, కమ్మర్పల్లి, వేల్పూర్ మండలాల్లో కూడా పలు పంచాయతీరాజ్ రోడ్లకు బీటీ మరమ్మతులు చేయాల్సి ఉంది. బాన్సువాడ నియోజకవర్గంలోని మూడు రోడ్ల బీటీ మరమ్మతులకు రూ. 1.40 కోట్లు మంజూరు అయ్యాయి. బోధన్ నియోజకవర్గంలోని మూడు రోడ్ల బీటీ మరమ్మతులకు రూ. 75 లక్షలు మంజూరు అయ్యాయి. జుక్కల్ నియోజకవర్గంలో మూడు రోడ్ల బీటీ మరమ్మతులకు రూ.1.43 కోట్లు మంజూరు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో నాలుగు రోడ్ల మరమ్మతులకు రు. 1.68 కోట్లు మంజూరు అయ్యాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక రోడ్డు మరమ్మతులకు రూ.11 లక్షలు, కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్డు మరమ్మతులకు రూ. 20 లక్షలు, ఆర్మూర్ నియోజకవర్గంలో రూ. 30 లక్షలతో రోడ్ల మరమ్మతులు చేపట్టనున్నారు. నిజామబాద్ అర్బన్ నియోజకవర్గం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో లేదు. అయితే జిల్లాలోని ఎనిమిది గ్రామీణ నియోజకవర్గాలలో బాల్కొండ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు మంజూరు అయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలోని మూడు రోడ్ల బీటి మరమ్మతులకు రూ. 2.29 కోట్లు మంజూరు అయ్యాయి. జిల్లాలో ఎక్కువ నిధులు మంజూరు అయిన ఘణత బాల్కొండ నియోజకవర్గానికి దక్కనుంది. కాగా ప్రభుత్వం స్పందించి అన్ని పంచాయతీరాజ్ శాఖ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.