ఇక పనుల పందేరం
అధికార పార్టీ నేతలకు రూ.100 కోట్ల పనులు
నీరు-చెట్టు కింద అంచనాల్లో నిమగ్నమైన అధికారులు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమ్ముళ్లు
1500 చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు
పనుల పంపకాలకు తెర లేచింది. గతంలోనే నీరు-చెట్టు కింద అందినకాడికి దోచుకున్న అధికార పార్టీ నేతలకు మరో రూ.100 కోట్ల పనులు కట్టబెట్టనున్నారు. చెరువుల మరమ్మతుల పేరుతో ఈ నిధులను వెచ్చించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
తిరుపతి: జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద ఈ ఏడాది రూ.100 కోట్ల పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పనులను గుర్తించడం, అంచనాలు రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ భాగం చెరువుల్లో నీరు ఉండడంతో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించే దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
పనుల గుర్తింపు ఇలా..
నీరు-చెట్టు పనులకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని జిల్లాలోని నేతలు తమకు అనువు గా మలచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఈ కార్యక్రమం కింద వంకలు, వాగులపై చెక్‌డ్యాంలు, పంటకాలువలు, చెరువుల్లో పూడికతీత, కంపచెట్ల తొలగింపు, కట్టలను బలపరచడం, తూములు, గేట్ల పునరుద్ధరణ, చెరువు మొరవలు, కాంక్రీట్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కార్యాలయాల చుట్టూ తమ్ముళ్లు
నీరు-చెట్టు కార్యక్రమంలో పనులను గుర్తించి అధికారులతో అంచనాలు రూపొందించుకునేందుకు అధికార పార్టీ నేతలు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది నామమాత్రంగా పనులు చేసి లక్షల రూపాయలు స్వాహా చేసిన నేతలు మళ్లీ, ఈ ఏడాది అలానే పనులు చేసి అందిన కాడికి దోచుకునేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో అవసరం లేకున్నా పనులు చేయడం, ఒకే పనిని రెండుమార్లు చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది రూ.136 కోట్ల పనులకు అనుమతి ఇచ్చారు. ఇందులో రూ.103 కోట్ల మేర పనులు చేసి తెలుగు తమ్ముళ్లు జేబులు
ఇక పనుల పందేరం
నింపుకొన్నారు. పనుల్లో జన్మభూమి కమిటీలది పెత్తనం కావడం, పనులను నామినేషన్‌పైనే కట్టబెడుతుండడంతో దేశం ద్వితీయ శ్రేణి నేతలు పనులు దక్కించుకొనేందుకు అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. కొంత మంది పచ్చ నేతలు, తమ అధినాయకులకు కమీషన్లు ఇచ్చి పనులు దక్కించుకొనే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల పనులు, దీనికి తోడు మట్టి పనులు కావడంతో సొమ్ము చేసుకోవచ్చనే దిశగా తెలుగు తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. అధిష్టానం సైతం కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా నీరు-చెట్టు పనులను నామినేషన్‌పై కేటాయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8000 పైగా చెరువులున్నాయి. ఈ ఏడాది దాదాపు 1500 చెరువులకు పైగా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలనే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నాం
నీరు-చెట్టు కార్యక్రమం కింద పనుల గుర్తింపు కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించాం. దాదాపు రూ.100 కోట్ల మేర పనుల కోసం అంచనాలు రూపొందిస్తున్నాం. చెరువుల్లో నీరు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్ణీత కాలవ్యవధిలోపు పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. - శ్రీరామకృష్ణ. ఎస్ఈ, నీటిపారుదల శాఖ, చిత్తూరు