శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు.
రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు.