ఏప్రిల్ నెలఖారుకు మెట్రో సేవలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో తొలిసారిగా నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏప్రిల్ నెలాఖరునాటికి అందుబాటులోకి రానుంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ 11.4 కి.మీ.పొడవుతో కూడిన ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్’ (ఆర్డీఎస్ఓ) నిర్వహించిన పరీక్షల నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న ‘ముంబై మెట్రో-1 ప్రైవేట్ లిమిటెడ్’ కు సర్టిఫికెట్ లభించనుంది.
ఆ తర్వాత భద్రతకు సంబంధించిన తుది పరీక్షలు ‘కమిషనర్ ఫర్ మెట్రో రైల్వే సేఫ్టీ’ ద్వారా నిర్వహిం చగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇది ఏప్రిల్ మూడో, లేదంటే నాలుగో వారంలో పూర్తయ్యే అవకాశముంది. ఈ రైళ్లు ప్రారంభంలో గంటకు 50 కి.మీ. వేగంతో పరుగెడుతాయని మెట్రో-వన్ అధికారులు వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్ట్ మొత్తం పిల్లర్ల మీదు నుంచి ఉంది. రైలు ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ట్రాక్‌కు ఇరువైపులా మురికివాడలు, లెవెల్ క్రాసింగ్‌లు లేవు. మెట్రో రైల్వే ట్రాక్‌లు ప్రత్యేక లోహంతో తయారుచేసినవి కావడంతో ప్రమాదాలు జరగవు.
దీంతో గంటకు 80 కి .మీ. వేగంతో రైళ్లను నడపేందుకు ఎలాంటి ఇబ్బంది లేద’ని ఆర్డీఎస్ఓ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రమాదకర మలుపులవద్ద వేగాన్ని నియంత్రించాల్సి ఉందని, మిగతా చోట్ల వేగంగానే వెళ్లేందుకు అనుమతివ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా మోనో రైలుకు ఇచ్చిన డెడ్లైన్లు సుమారు 11సార్లు వాయిదా పడ్డాయి. చివరకు ఫిబ్రవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మెట్రో విషయంలో అలా జరగదని, సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని మెట్రో-వన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి.