research papers
-
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
పటిష్టంగా భారత ఎకానమీ
దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్ సానుకూల అంశాలను వెలువరించాయి. అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్ ఆర్బీఐ బులెటిన్‌లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలను చూస్తే...ధరల్లో స్థిరత్వం..‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రూపొందించిన ఈ ఆర్టికల్, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల..ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్ జాన్, ఆసిష్ థామస్ జార్జ్‌లు రాసిన మరో ఆర్టికల్ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్ ఫుడ్ ప్రైసెస్ స్పిల్లింగ్ ఓవర్? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్‌లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్ పేర్కొంది. ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!నిధులకోసం ప్రత్యామ్నాయాలు..డిపాజిట్ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్ చూస్తోందని బులెటిన్ ప్రచురితమైన మరో ఆర్టికల్ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్ డిపాజిట్ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది. -
రికార్డు బ్రేక్ చేసిన వరంగల్ నిట్
కాజీపేట అర్బన్: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2021 విద్యా సంవత్సరంలో 1,000 పరిశోధన పత్రాలతో తన రికార్డు తానే బ్రేక్ చేసింది. రికార్డుస్థాయిలో పరిశోధనలు చేపట్టి పరిశోధన పత్రాల ప్రచురణ రికార్డు బ్రేక్ చేసినట్లు స్పోపస్ డేటాబేస్ సంస్థ వెల్లడించడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులను ఆయన అభినందించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో ప్రత్యేకత చాటుకుంటున్న నిట్ వరంగల్ 2017 విద్యా సంవత్సరంలో 540 పరిశోధన పత్రాలను ప్రచురణకు ఇవ్వగా.. 2021లో రికార్డుస్థాయిలో వెయ్యి పరిశోధన పత్రాలను సమర్పించడం విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. ఇది నిట్ మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్) -
మోదీ కేర్‌కు లక్ష కోట్లు కావాలి
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్లో భారీ స్థాయిలో ప్రకటించిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం(మోదీ కేర్) అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. బీమా మొత్తంలోని 2 శాతాన్ని ప్రీమియంగా వసూలు చేసినా.. పథకం అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమని అధ్యయనం తేల్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపీఎఫ్పీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మితా చౌదురీ రూపొందించిన ఈ పత్రంలో.. ‘మోదీ కేర్ పథకం వల్ల రాష్ట్రాలు తమ సొంత ఆరోగ్య పథకాల్ని అమలు చేసుకునే స్వేచ్ఛ తగ్గవచ్చు’ అని ఆందోళన వెలిబుచ్చారు. ‘మోదీ కేర్’ అమలుకు ఏడాదికి రూ. 10 నుంచి 12 వేల కోట్లు సరిపోతాయని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ విశ్లేషించిన నేపథ్యంలో పరిశోధన పత్రంలోని అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘60 శాతం నిధుల్ని కేంద్రం, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని నిర్ణయించారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 60 వేలకోట్లు సమకూర్చాలి’ అని పరిశోధన పత్రంలో తెలిపారు. మోదీ కేర్‌పై విమర్శల్ని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. అదనంగా వసూలు చేసే 1% సెస్ నిధులు ఈ పథకం అమలుకు సరిపోతాయన్నారు. -
తెలంగాణ జనజీవన కథకుడు
గత రెండు దశాబ్దాలలో తెలంగాణ వచ్చిన పరిణామ క్రమాలు తెలియాలంటే పెద్ద పెద్ద పరిశోధన పత్రాలు అక్కర్లేదు. పెద్దింటి అశోక్‌కుమార్ కథలు చదివితే చాలు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సూక్ష్మదర్శినిలో చిత్రించడం అతడి ప్రత్యేకత. గత పదహారు సంవత్సరాలుగా నూట ఇరవై కథలు, ఐదు నవలలు, ఒక వ్యాస సంపుటి వెలువరించి అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ ప్రసిద్ధి చెందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. ఊటబాయి, వలస బతుకులు, మా ఊరి భాగోతం, భూమడు, మాయిముంత... ఈ పుస్తకాలన్నీ తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసేలా సృజనా శక్తిని ప్రదర్శించిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. డెబ్బైల తర్వాతి తెలంగాణ గ్రామీణ సమాజాన్ని, అక్కడ ఉద్యమం తీసుకొచ్చిన పెను మార్పుని అల్లం రాజయ్య బలంగా అక్షరబద్ధం చేస్తే గత రెండు దశాబ్దాల తెలంగాణ ప్రాంత ఒడిదుడుకుల్ని, విధ్వంసాన్ని అంతే విస్తృతంగా అక్షరీకరించినవాడు అశోక్‌కుమార్. అతడి అన్ని కథలూ ఏదో ఒక సమస్యనూ దాని మూలాన్నీ దాని వల్ల జరుగుతున్న మానవ విలువల పతనాన్ని చూపుతాయి. తెలంగాణ ప్రాంతంలో కరువు విశ్వరూపం (తండ్లాట), సంప్రదాయ సేద్యాన్ని మింగేస్తున్న కార్పొరేట్ సేద్యం నీచత్వం (కీలుబొమ్మలు), రైతుల్ని కుదేలు చేసి వారిని విత్తనాలకు దూరం చేసే దళారీల దగుల్బాజీతనం (అదృశ్యరూపాలు), పేద రైతులని కూడా చూడకుండా వాళ్ల రక్తం పీల్చేసే ఆర్.ఎం.పిలు, వాళ్ల పంటను మింగే ఎరువుల వ్యాపారుల దుర్మార్గం (చెడుగులు), ఇవన్నీ భరించలేక తుదకు మనిషిని నమ్ముకోవడం కంటే పశువును నమ్ముకుందామనుకునే దీనత్వం (మాయిముంత).. ఇవన్నీ అశోక్ కుమార్ తన కథలలో చూపడంతో తెలంగాణ జన జీవితాల్లోకి పాఠకుడు చొచ్చుకుపోతాడు. ఆ మట్టిలో జీవించిన అనుభూతికి లోనవుతాడు. అలాగని తక్కిన జీవితాన్ని వదిలిపెట్టలేదు అశోక్‌కుమార్. కులవృత్తుల పరిణామక్రమాన్ని, పతనాన్ని ‘వలస పక్షి’, ‘తెగిన బంధాలు’, ‘కాగుబొత్త’ వంటి కథల్లో చాలా శక్తిమంతంగా చూపుతాడు. ఇక సాంప్రదాయిక కులవృత్తుల్లో భాగంగా ఎలుగుబంట్లను ఆడించేవారిపై ఇతడు రాసిన ‘జిగిరీ’ నవల బహుశా భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన నవలగా నిలబడిపోతుంది. ఇవన్నీ చెప్పడానికి అశోక్‌కుమార్ దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? అతడి భాషే. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా ప్రాంత మారుమూల గ్రామాల యాస అశోక్‌కుమార్‌కు అందివచ్చిన సంపద. అతడి కథల్లోని సంభాషణల్లో ఒక వేదన ఉంటుంది. గొప్ప కరుణ ఉంటుంది. ఒక దైన్యం వెంటాడుతూనే ఒక తెగువ రాజుకుంటూ ఉంటుంది. తెలంగాణ మాండలిక సొగసును ఒడుపుగా వినసొంపుగా ధ్వనింపజేసి కథకు గొప్ప ఆత్మను అందించినవాడు పెద్దింటి అశోక్‌కుమార్.ఇంత రాయడం, ఇంతలా రాయడం సామాన్యమేమి కాదు.అశోక్‌కుమార్ మరిన్ని అడుగులు ముందుకు వేయడానికే ఈ నాలుగు మాటలైనా. - కాట్రగడ్డ దయానంద్ 9490218383 జనవరి 3న అనకాపల్లిలో అజో-విభో- కందాళం ఫౌండేషన్ విశిష్ట నవలా పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా -
నేటి నుంచి వైఖానస ఆగమ సదస్సు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమప్రోక్తంగా నిర్వహించే పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవల విశిష్టతను తెలిపేలా శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు వైఖానస ఆగమ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల నేతృత్వంలో ఆస్థాన మండపంలో ఈ సదస్సు నిర్వహణకోసం హిందూ ధర్మప్రచార పరిషత్ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఉపన్యాసాలు ఉంటాయి. 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ప్రసంగాలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సమావేశం నిర్వహిస్తారు. సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి వైఖానస ఆగమ పండితులు పాల్గొంటారు. లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం- జిజ్ఞాసాధికరణం, వైఖానసమ తత్త్వచింతన, అష్టాదశ శారీర సంస్కార విశిష్టత, ఉత్తమ బ్రహ్మ విద్య వైఖానస ఆగమం వంటి అనేక అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. 15న తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీన ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 17 తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఆలయంలో 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించరు. ఆరోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. ఇక 17వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమల ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఆ రోజు నుంచే ఆలయ నిర్వహణ లెక్కలు ప్రారంభిస్తారు.