తెలంగాణ జనజీవన కథకుడు
గత రెండు దశాబ్దాలలో తెలంగాణ వచ్చిన పరిణామ క్రమాలు తెలియాలంటే పెద్ద పెద్ద పరిశోధన పత్రాలు అక్కర్లేదు. పెద్దింటి అశోక్‌కుమార్ కథలు చదివితే చాలు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సూక్ష్మదర్శినిలో చిత్రించడం అతడి ప్రత్యేకత.
గత పదహారు సంవత్సరాలుగా నూట ఇరవై కథలు, ఐదు నవలలు, ఒక వ్యాస సంపుటి వెలువరించి అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ ప్రసిద్ధి చెందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. ఊటబాయి, వలస బతుకులు, మా ఊరి భాగోతం, భూమడు, మాయిముంత... ఈ పుస్తకాలన్నీ తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసేలా సృజనా శక్తిని ప్రదర్శించిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్. డెబ్బైల తర్వాతి తెలంగాణ గ్రామీణ సమాజాన్ని, అక్కడ ఉద్యమం తీసుకొచ్చిన పెను మార్పుని అల్లం రాజయ్య బలంగా అక్షరబద్ధం చేస్తే గత రెండు దశాబ్దాల తెలంగాణ ప్రాంత ఒడిదుడుకుల్ని, విధ్వంసాన్ని అంతే విస్తృతంగా అక్షరీకరించినవాడు అశోక్‌కుమార్. అతడి అన్ని కథలూ ఏదో ఒక సమస్యనూ దాని మూలాన్నీ దాని వల్ల జరుగుతున్న మానవ విలువల పతనాన్ని చూపుతాయి.
తెలంగాణ ప్రాంతంలో కరువు విశ్వరూపం (తండ్లాట), సంప్రదాయ సేద్యాన్ని మింగేస్తున్న కార్పొరేట్ సేద్యం నీచత్వం (కీలుబొమ్మలు), రైతుల్ని కుదేలు చేసి వారిని విత్తనాలకు దూరం చేసే దళారీల దగుల్బాజీతనం (అదృశ్యరూపాలు), పేద రైతులని కూడా చూడకుండా వాళ్ల రక్తం పీల్చేసే ఆర్.ఎం.పిలు, వాళ్ల పంటను మింగే ఎరువుల వ్యాపారుల దుర్మార్గం (చెడుగులు), ఇవన్నీ భరించలేక తుదకు మనిషిని నమ్ముకోవడం కంటే పశువును నమ్ముకుందామనుకునే దీనత్వం (మాయిముంత).. ఇవన్నీ అశోక్ కుమార్ తన కథలలో చూపడంతో తెలంగాణ జన జీవితాల్లోకి పాఠకుడు చొచ్చుకుపోతాడు. ఆ మట్టిలో జీవించిన అనుభూతికి లోనవుతాడు. అలాగని తక్కిన జీవితాన్ని వదిలిపెట్టలేదు అశోక్‌కుమార్. కులవృత్తుల పరిణామక్రమాన్ని, పతనాన్ని ‘వలస పక్షి’, ‘తెగిన బంధాలు’, ‘కాగుబొత్త’ వంటి కథల్లో చాలా శక్తిమంతంగా చూపుతాడు. ఇక సాంప్రదాయిక కులవృత్తుల్లో భాగంగా ఎలుగుబంట్లను ఆడించేవారిపై ఇతడు రాసిన ‘జిగిరీ’ నవల బహుశా భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన నవలగా నిలబడిపోతుంది.
ఇవన్నీ చెప్పడానికి అశోక్‌కుమార్ దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? అతడి భాషే. కరీంనగర్ జిల్లా సిరిసిల్లా ప్రాంత మారుమూల గ్రామాల యాస అశోక్‌కుమార్‌కు అందివచ్చిన సంపద. అతడి కథల్లోని సంభాషణల్లో ఒక వేదన ఉంటుంది. గొప్ప కరుణ ఉంటుంది. ఒక దైన్యం వెంటాడుతూనే ఒక తెగువ రాజుకుంటూ ఉంటుంది. తెలంగాణ మాండలిక సొగసును ఒడుపుగా వినసొంపుగా ధ్వనింపజేసి కథకు గొప్ప ఆత్మను అందించినవాడు పెద్దింటి అశోక్‌కుమార్.ఇంత రాయడం, ఇంతలా రాయడం సామాన్యమేమి కాదు.అశోక్‌కుమార్ మరిన్ని అడుగులు ముందుకు వేయడానికే ఈ నాలుగు మాటలైనా.
- కాట్రగడ్డ దయానంద్ 9490218383
జనవరి 3న అనకాపల్లిలో అజో-విభో- కందాళం ఫౌండేషన్ విశిష్ట నవలా పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా