భారత్ వైపు 'లీ ఇకో' దృష్టి
ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు ప్రపంచదృష్టిని భారత్ వైపు మరల్చుతున్నాయి. ప్రపంచ ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు భారత్‌లో తయారీ సంస్థలు ఏర్పాటుచేయడానికి మొగ్గుచూపుతున్నాయి. చైనీస్ ఇంటర్ నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థ 'లీ ఇకో' తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లను భారత్ లో ఏర్పాటుచేయాలని చూస్తున్నామని ఆ కంపెనీ వైస్ చైర్మన్, కో-ఫౌండర్ లియు హాంగ్ తెలిపారు. టెక్నాలజీ పరంగా భారత్ లో లీ ఇకో తమ శక్తిని చాటుకునేందుకు పెద్ద మొత్తంలో రిటైల్, ఆఫ్ లైన్ స్టోరులు కూడా ఏర్పాటుచేయబోతున్నట్టు పేర్కొన్నారు.
సింగిల్ బ్రాండ్ రిటైల్ లైసెన్సు కోసం ఇప్పటికే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డులో దరఖాస్తు చేసుకున్నామని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయ్‌పూర్ ఎలక్ట్రానిక్ క్లస్టర్, భోపాల్, బైల్వాడ(రాజస్తాన్) ప్రాంతాల్లో ఎక్కడైనా తయారీ సంస్థను ఏర్పాటు చేసుకోవాలని టెక్నాలజీ శాఖ తమకు సూచించినట్లు లియు హాంగ్ చెప్పారు. ఆ ప్రాంతాలను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీతో, టెలికాం మంత్రితో సమావేశం అవుతామని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో తమవంతు సహాకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రారంభ పెట్టుబడిగా రూ.50 కోట్లతో 8-10 లీ ఇకో స్టోర్లు, 500 ఫ్రాంచైజీ దుకాణాలను తెరుస్తున్నట్టు హాంగ్ చెప్పారు. తమ ఆఫ్‌లైన్ స్టోర్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉంటాయన్నారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ఫుల్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో లీ ఇకో సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.