రిప్ వాన్ వింకిల్
హడ్సన్ నది మీద ఎగువకు ప్రయాణం చేసిన వారంతా కాట్స్ కిల్ పర్వతాలను చూసి ఉంటారు. హడ్సన్ నదికి పశ్చిమంగా ఎత్తుగా హుందాగా నిలబడిన ఈ పర్వతాలు ఆ పరిసర ప్రాంతాన్నంతా పరిపాలిస్తున్నట్లుగా ఉంటాయి. ఈ దేవతా పర్వతాల పాదతలం వద్ద నీలిరంగు మెరక నేలలూ, సమీపంలో కనిపించే పచ్చని బయళ్ళూ కలిసే చోట చెట్ల గుబురుల మధ్య తెల్లని ఆవిరిపొగలు కక్కే ఒక పల్లె ఉన్న సంగతి ఈ ప్రాంతాన్ని చూసి వచ్చిన యాత్రికులకు గుర్తు ఉంటుంది. ఆ పల్లె అతి ప్రాచీనమైన ఒక చిన్న వలస. అమెరికాకు యూరోపియన్లు మొట్ట మొదట వలస వచ్చిన రోజులలో డచ్ వలసదారులు ఆ పల్లెను కట్టుకున్నారు. ఆ పల్లెలోనే చాలా కాలం క్రిందట, పరమసాధువైన ఒక నిరాండబరమైన వ్యక్తి ఉంటుండేవాడు. అతని పేరు రిప్ వాన్ వింకిల్. ఇతడి వంశం కీర్తి ప్రతిష్ఠలు గలది.అయితే రిప్కి తాతముత్తాతల ప్రచండ శౌర్య సాహసాలు మాత్రం అబ్బలేదు. భార్య పట్ల భయభక్తులతో ప్రవర్తించే పరమసాధు భర్త. ఈ గుణమే అతని విశ్వవిఖ్యాతికి ముఖ్య హేతువేమో! గయ్యాళి భార్య కూడా ఒక విధంగా అదృష్టవంతులకు భగవద్దత్తంగా లభించే వరప్రసాదమనే చెప్పాలి. ఈ విషయం ఒప్పుకుంటే, రిప్వాన్ వింకిల్ మహా అదృష్టవంతుడన్న మాట కూడా ఒప్పుకున్నట్టే!ఆ గ్రామంలోని ఇళ్ళ వాళ్ళందరికీ అతడంటూ అమితమైన ఆదరభావం. అతని జీవితంలో ఒక లోపం ఉంది. తనకు లాభసాటి పని ఏదన్నా అతనికి ఎంతమాత్రం గిట్టేది కాదు. ఎంత కష్టమైన పనిలో అయినా సరే, ఇరుగుపొరుగు వారికి సాయపడేవాడు. తన ఇంటిపని తప్ప మరెవరి పనైనా సరే అతి శ్రద్ధగా చేసిపెట్టేవాడు.ఇక అతని బిడ్డలు: చింకి దుస్తులు కట్టుకొని గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటారు. కొడుకు చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రి నోట్లోంచి ఊడి పడ్డట్టు ఉంటాడు. ఎప్పుడూ తల్లి వెంటబడి తిరుగుతూ ఉండేవాడు.
రిప్ వాన్ వింకిల్ ఈ ప్రపంచంలో దేనికీ ఉబ్బితబ్బిబ్బు అయ్యే రకం కాదు. రూపాయి కోసం నానా గడ్డి కరిచే కంటే బటానీ గింజలతో కాలక్షేపం చేస్తూ నిశ్చింతగా బతకవచ్చుననే బాపతు మనిషి. లోకం అతని బతుకు అతనిని బతకనిస్తే, జీవితమంతా అంతులేని తృప్తితో ఈల వేసుకుంటూ గడిపి వేయగలడు. కాని, ఇంట్లో భార్యే అతనికి అవకాశం ఇవ్వడం లేదు. భర్త సోమరితనం, నిర్లక్ష్యం గురించీ అస్తమానం అతని చెవిలో జోరిగలాగ అరవడం ఆమెకు అలవాటైపోయింది. ఇంట్లో రిప్ని కనికరంతో చూసేది అతని కుక్క సర్దార్ ఒక్కటే! దానికి కూడా, దాని యజమానికిలాగే ఆ గృహిణి అంటే హడలు. బహుశా ఇదే ఈ స్నేహానికి కారణం అయి ఉండవచ్చు. సోమరితనంలో వీళ్ళిద్దరూ సహాధ్యాయులని ఆమె నిశ్చితాభిప్రాయం.పాపం! రిప్ జీవితం నిరాశమయమైపోయింది. పొలంలో పనినించీ, తన భార్య తిట్ల నుంచీ తప్పించుకోవడానికి ఇక అతనికి ఒక్కటే ఉపాయం మిలిగింది. తుపాకీ చేతబట్టుకుని వేటకు చల్లగా అడవికి పోవడం. అలాంటి ఒక స్వేచ్ఛా వనవిహరం సందర్భంలో రిప్ యాథాలాపంగా కాట్స్కిల్ పర్వతాలలోని ఒక అత్యున్నత ప్రదేశానికి ఎక్కి వెళ్లాడు. తిరిగి, తిరిగి, చివరికి అలసి ఆయాసపడుతూ పోయి ఒక గుట్ట మీద పచ్చగడ్డి పెరిగి ఉన్న దిమ్మ మీద కూలబడ్డాడు. రిప్ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు. చీకటి పడేలోగా తాను ఇంటికి చేరుకొనవలెననే విషయం రిప్కు చప్పున స్ఫురణకు వచ్చింది. దాంతో మళ్లీ ఇంటివద్ద తన గృహిణి చేయబోయే హంగామాను గురించి ఆలోచించుకుంటూ ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాడు. కిందికి దిగడానికి లేచేసరికి, ఎక్కడో దూరం నించి ‘రిప్ వాన్ వింకిల్!’ అంటూ పెద్ద కేక వినిపించింది. చుట్టూ తిరిగి చూశాడు. పర్వతం మీదుగా ఒంటరిగా ఎగిరిపోతూన్న ఒక కాకి తప్ప ఎక్కడా ఎవరూ కనిపించలేదు. భ్రమ పడ్డానేమో అనుకుని, మళ్లీ కొండ దిగడం మొదలు పెట్టాడు. మళ్లీ అదే పిలుపు! ఒక విచిత్ర వ్యక్తి వీపు మీద పెద్ద బరువుతో కృంగిపోతూ తన వంకకే ఎక్కి వస్తున్నాడు. ఒత్తుగా పెరిగిన తెల్లగడ్డం అతని ముసలితనాన్ని బయట పెడుతోంది. భుజం మీద పెద్ద సారా జాడీ ఉంది. ఈ బరువు మోసుకుని పోవడానికి కొంచెం సహాయపడతావా? అన్నట్లుగా రిప్కి సంజ్ఞ చేశాడు. ఈ నూతన మిత్రుని గురించి కొంత అనుమానం ఉన్నప్పటికి అంగీకరించాడు రిప్. ఆ జాడీని చెరి కాసేపు మోస్తూ, మెల్లగా ఆ లోయ వెంట ఇంచుమించు పాకుతూ ఇద్దరూ పైకి ఎక్కారు. కొండపైకి ఎక్కిన కొద్ది ఆగి ఆగి ధణధణమంటూ పెద్ద చప్పుడు ఏదో వినబడుతూంది. ఆ కొండల్లో ఎక్కడో ఉరుములు మెరుపులతో హఠాత్తుగా కురిసే వర్షపు చప్పుడు అయి ఉండవచ్చునని సమాధానం చెప్పుకుని మళ్ళీ ముందుకు సాగాడు.
సర్కస్ వలయంలాంటి పల్లపు ప్రదేశానికి చేరగానే వింత వింత దృశ్యాలు కనిపించినయి. చదునుగా ఉన్న ఒకచోట కొతమంది విచిత్రవ్యక్తులు ‘తొమ్మిది మేకుల బంతాట’ ఆడుతున్నారు. వారి నడుముకి బిగించి ఉన్న పట్టాల నించి పొడవాటి పట్టా కత్తులు వేలాడుతున్నాయి. వారి ముఖాలు అదో మాదిరి ఉన్నాయి. రంగురంగుల గడ్డాలు ఉన్నాయి. ఈ వ్యక్తులంతా కులాసాగా ఆడుకుంటున్నప్పటికీ వారి ముఖాలన్నీ అతి గంభీరంగా ఉండడం, ఎవరూ ఏమీ మాట్లాడకపోవడం రిప్కి ఆశ్చర్యంగా తోచింది. మధ్యమధ్య వాళ్లు బంతులు దొర్లించినప్పుడు అయ్యే శబ్దం మాత్రం ఉండుండి పెద్ద ఉరుములాగ ఆ లోయ అంతటా మారుమోగుతూంది. రిప్, అతని సహచరుడు వారిని సమీపించే సరికి, వాళ్లు ఆట మానేసి, ప్రతిమలాగ నిలబడి కళాకాంతులు లేని ముఖాలతో వికృతంగా చూస్తున్నారు. దాంతో రిప్ గుండెల్లో మోత ప్రారంభమైంది. ఈలోగా అతని అనుచరుడు ఆ జాడీలోని సారాను కూజాల్లో నింపాడు. గోష్ఠిలోని వ్యక్తులందరూ మాటా పలుకు లేకుండానే మస్తుగా సారా తాగేసి మళ్లీ ఆట మొదలుపెట్టారు. ఎవరూ తనవైపు చూడకుండా ఉన్నప్పుడు కొంచెం పానీయం రుచి చూశాడు రిప్. అది హాలెండ్ దేశపు అమృతంలాగ ఉంది. కొసరి కొసరి దఫాల వారీగా ఆ కూజాలను వంపి కడుపు నింపేశాడు. క్రమంగా మైకం క్రమ్మడం ఆరంభించింది. ఎన్నడూ ఎరగని గాఢనిద్రలో మునిగిపోయాడు. నిద్రలేచి చూసేసరికి, పర్వతం మీది పచ్చికతిన్నె మీద పడుకుని ఉన్నాడు. కళ్లు నులుముకొని చుట్టూ చూశాడు. వెచ్చవెచ్చగా పొద్దెక్కుతున్న ఉదయసమయం. తెల్లవార్లూ ఇక్కడే నిద్రపోయి ఉంటానా? ఉండను బహుశా అనుకున్నాడు. ‘‘ఆ కూజా మందే నా కొంప తీసింది! ఏం జవాబు చెప్పుకొని ఏడవను, మా ఇంటావిడకి?’’ అనుకున్నాడు. తుపాకి కోసం కలయ చూశాడు. ఎప్పుడూ నిగనిగలాడే తన తుపాకీకి బదులు తుప్పు పట్టిన తుపాకీ ఒకటి తన కంటపడింది. ఆ లోయలోని రాక్షసులు తనను మంత్రించి, ఆ సారాతో స్మృతి లేకుండా చేసి తన తుపాకి కాజేశారని రిప్ అనుమానం. పైగా, తన సర్దార్ కూడా కనిపించడం లేదు. ఈల వేసి పిలిచాడు. ‘సర్దార్’ అని అరిచాడు. సర్దార్ జాడలేదు.
కష్టం మీద ఎల్లాగో కాళ్లూ చేతులూ స్వాధీన పరుచుకుని నిమ్మళంగా ఆ లోయలోకి దిగాడు. ఉదయం ఆహారమేమీ లేకపోవడంతో చాలా నిస్సత్తువగా ఉంది. కుక్కా, తుపాకీ పోవడం అతని మనస్సు మనస్సులో లేదు. మరొక వంక ఇంటికి పోయి, భార్య ఎదుట పడడానికి దమ్ములు లేవు. అలా అని ఇంటికి వెళ్లకుండా ఈ కొండల మధ్య ఆకలితో మాడి చచ్చిపోవడమెలాగు? తుప్పు పట్టిన తుపాకీ తీసి భుజాన పెట్టాడు. ఆందోళన, ఆవేదనతో ఇంటిదారి పట్టాడు. ఊరు సమీపిస్తున్న కొద్దీ అతనికి చాలామంది ఎదురవుతున్నారు. కాని వారిలో పరిచితుడొక్కడూ కనిపించకపోవడం ఆశ్చర్యం వేసింది. వాళ్ల దుస్తులు కూడా ఏమిటో కొత్తగా ఉన్నాయి. ఎదురైన ప్రతి వ్యక్తి తన వంక ఆశ్చర్యంగా ఎగాదిగా చూసి, తన గడ్డాన్ని నిమురుకుని చూసుకుంటున్నాడు. అందరూ అలా చూస్తూండడంతో అప్రయత్నంగా రిప్కి కూడా చెయ్యి తన గడ్డం మీదికి పోయింది. దాంతో తనకు పొడుగైన గడ్డం పెరిగిందని గ్రహించి ఆశ్చర్యపోయాడు. ఊరి పొలిమేరల్లోకి వచ్చేశాడు. వింత వింత దుస్తులు వేసుకున్న కుర్రవాళ్లంతా తెల్లగా నెరిసిన అతని పెద్ద గెడ్డాన్ని చూసి నవ్వుతూ, నానా హంగామా చేస్తూ వెంటబడ్డారు. ఎటు చూసినా, ఏది చూసినా, ఇంద్రజాలంలోలాగ మారిపోయింది. ఆ క్రిందటి రోజే తానక్కడి నించి వెళ్లాడు. ఇంతలోనే గ్రామమంతటా ఏమిటీ మార్పు! మొత్తం మీద అది తన గ్రామమే! అందులో సందేహమేమీ లేదు.
కష్టం మీద దారి గుర్తు తెచ్చుకుంటూ, ఏ క్షణంలో ఎటు నుంచి తన భార్య కఠోర కంఠస్వరం వినిపిస్తుందో అని ప్రాణాలు బిగపట్టుకుని తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇల్లంతా పాడుపడి ఉంది. తిండి లేక మాడి చావడానికి సిద్ధంగా ఉన్న సర్దార్ పోలికలున్న కుక్క ఒకటి అక్కడ తారట్లాడుతూంది. ‘సర్దార్’ అని పిలిచాడు. కాని, ఆ కుక్క పళ్లు బిగబట్టి మూల్గుతూ ప్రక్కకు తొలిగిపోయింది. ‘‘నా కుక్క కూడా నన్ను మరిచిపోయిందా?’’ అని నిట్టూర్చాడు.స్వగృహంలోకి ప్రవేశించాడు రిప్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎంత చాకిరీ చేసినా రిప్ భార్య ఆ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేది. ఇప్పుడు ఇల్లు దెయ్యాలకొంపలాగ ఉంది. గొంతు సవరించుకొని భార్యాపిల్లలను పేరు పేరునా పిలిచాడు. ఆ పాడు గోడల మధ్య అతని కంఠస్వరమే వినిపించింది. మళ్ళీ ఎప్పటి నిశ్శబ్దమే! ఏమీ బోధ పడక అక్కణ్ణించి తాను మాములుగా రోజూ వెళ్లి కాలక్షేపం చేసే సత్రం దగ్గరకు వెళ్ళేసరికి, ఆ సత్రం అక్కడ లేనే లేదు. దాని స్థానంలో, కలప చెక్కలతో కట్టిన పాత ఇల్లొకటి ఉంది. ఆ ఇంటి తలుపు మీద ‘యూనియన్ హోటల్ –ప్రొప్రయిటర్: జొనాథన్’ అని రాసి ఉంది. ఆ హోటలు ద్వారం వద్ద జనం గుంపుగా మూగి ఉన్నారు. అందులో ఒక్క ముఖమూ రిప్ గుర్తు పట్టలేదు. అతిగా పెరిగిపోయి గడ్డంతో, మకిలి దుస్తులతో, వెంటబడి వస్తూన్న పిల్లమూకతోను, కొందరు ఆడవాళ్లతోను అక్కడికి రిప్ వచ్చేసరికి గ్రామీణ రాజకీయవేత్తలందరి దృష్టులు ఒక్కసారిగా అతనిపై పడ్డాయి. వాళ్లంతా ఆయన చుట్టూ మూగారు. ఆశ్చర్యంతో ఎగాదిగా చూశారు. ఉపన్యాసకుడు అతని జబ్బ పట్టుకొని కొంచెం పక్కకు తీసుకెళ్లి ‘‘ఇంతకీ తమరు ఏ పక్షానికి ఓటు చేయదలుచుకున్నారు?’’ అని రహస్యంగా అడిగాడు. రిప్ ఆ మాటలకి అర్థం తెలియక అయోమయంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. పొట్టివాడొకడు రిప్ చెవిలో మెల్లగా ‘‘తమరిది ఫెడరల్ పక్షమా? డెమోక్రాట్ పక్షమా?’’ అని అడిగాడు. రిప్కు ఈ ప్రశ్న మరింత అయోమయంగా తోచింది. ఒక టోపీ పెద్దమనిషి జనాన్ని నెట్టి దారి చేసుకుంటూ రిప్ ఎదుటికి వచ్చి ‘‘ఎవరయ్యా నువ్వు? తుపాకి భుజాన పెట్టుకుని, అల్లరి మూకని వెంటబెట్టుకుని ఎన్నికల కేంద్రానికి రావడంలో నీ ఉద్దేశమేమిటి? ఈ గ్రామంలో తిరుగుబాటు లేవదీద్దామనా?’’ అన్నాడు.
‘‘అయ్యో! ఖర్మా! నేనో నిర్భాగ్యుణ్ణి. నాది ఈ ఊరే. నేను చక్రవర్తి ప్రభుత్వానికి పూర్తిగా విధేయుణ్ణి’’ అన్నాడు. ఈలోపు ‘‘చక్రవర్తి గూఢచారి, కాందీశికుడు. పట్టుకోండి. తన్నండి’’ అంటూ కేకలు బయలుదేరాయి. ‘‘అసలు నువ్వేం పనిమీదొచ్చావయ్యా ఇక్కడికి? ఎవరి కోసం?’’ అని మళ్ళీ రిప్ని ప్రశ్నించాడు టోపీ పెద్దమనిషి. ‘‘నేను ఎవ్వరికీ ఏ విధమైన హాని కలిగించడానికి రాలేదు. వెనక ఇక్కడ ఉండిన సత్రం అరుగు మీద రోజూ కలుసుకుంటూ ఉండిన మా ఇరుగు పొరుగు స్నేహితుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరా స్నేహితులు చెప్పు?’’ రిప్ ఒక్క నిమిషం ఆలోచించి ‘‘నికోలస్ వెడ్డర్గారు ఎక్కడ ఉన్నారు?’’ అని అడిగాడు. ‘‘ఆయన మరణించి అప్పుడే పద్దెనిమిదేళ్లయిందిగా!’’ అన్నాడు ఒక వృద్ధుడు. ‘‘పోనీ, బ్రూమ్ డచ్చర్గారు ఉన్నారా?’’ ‘‘స్టోనీపాయింట్ దగ్గిర యుద్ధంలో చచ్చిపోయాడంటారు’’ తన ఇల్లూ, స్నేహితులూ, గ్రామం ఇంతలో ఇంత దారుణంగా మారిపోయి, ప్రపంచంలో తాను ఒంటరివాడయిపోవడం రిప్కి అమిత విచారం కలిగించింది. నిస్పృహతో ‘‘పోనీ, ఇక్కడ ఎవరైనా రిప్ వాన్m వింకిల్ని ఎరుగుదురా?’’ అని అడిగాడు. ‘‘ఎరక్కేం?’’ అన్నారు వెంటనే ఇద్దరు ముగ్గురు ఒకేసారి. ‘‘అడుగో! ఆ ఎదురు గుండా ఉన్న చెట్టునానుకుని కూచున్నాడు చూడు, ఆ అవతారమే రిప్ వాన వింకిల్!’’ రిప్ అటుకేసి చూశాడు. సరిగా ముమ్మూర్తుల తనలాగే, తాను పర్వతం మీదికి వెళ్లే రోజున ఉన్నట్టే కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆ చెట్టునానుకుని కూచొని ఉన్నాడు. అసలు తా నెవరు? రిప్ వాన్ వింకిల్ కాదా? ఏమిటీ మాయ? ఈ కంగారంతా చూసి, టోపీ పెద్దమనిషి మళ్లీ కలిపించుకుని, అతని ఊరూ పేరూ అడిగాడు. ‘‘ఏమో! ఆ భగవంతుడికే తెలియాలి’’ అన్నాడు పిచ్చివాడిలాగ రిప్.
‘‘వాడెవడో నా వేషం వేసుకుని బతుకున్నాడు. నిన్న రాత్రి దాకా మామూలుగానే ఉన్నాను. రాత్రి ఆ పాపిష్టి పర్వతం మీద పడుకొని నిద్రపోయాను. వాళ్లు నా తుపాకీ మార్చేశారు. అంతా మారిపోయింది. నేను మారిపోయాను. ఇప్పుడు నా పేరేమిటో, నే నెవర్నో చెప్పలేను....చెప్పలేను’’ అన్నాడు. ఒక స్త్రీ చంకలో పిల్లవాడి నెత్తుకొని ఈ పొడుగు గడ్డం ముసలాన్ని తేరిపార చూడడానికి బాగా దగ్గిరికి వచ్చింది. తెల్లగడ్డం తాతను చూసి పసివాడు ఏడవడం మొదలు పెట్టాడు. ఆ పాపడి పేరూ, ఆ తల్లి రూపం, ఆమె కంఠస్వరం రిప్ మనస్సులో మరొక తుఫాన్ కెరటాన్ని రేపినయి. ఆయనకు ఏవేవో జ్ఞాపకానికి వస్తున్నయి.‘‘తల్లీ! నీ పేరేమిటమ్మా?’’ అని అడిగాడు.‘‘జూడిత్ గార్డెనీర్’’‘‘మీ తండ్రి పేరు?’’‘‘అయ్యో! మా తండ్రా? మా నాయన పేరు రిప్ వాన్ వింకిల్. ఇరవయేళ్ళ క్రిందట తుపాకి పట్టుకుని, వేటకని ఆ పర్వతాల్లోకి వెళ్ళాడు. ఇంత వరకు తిరిగి రాలేదు. మా నాన్నతో పాటు వేటకి వెళ్లిన కుక్కమాత్రం ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడో, లేక ఎర్ర ఇండియన్లే ఎత్తుకు పోయారో తెలియదు. అప్పటికి నాకు బాగా చిన్నతనం’’ అంది.రిప్ అడగదలుచుకున్న ముఖ్యమైన ప్రశ్న ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. నసుగుతూ, తొట్రూపడుతూ అడిగాడు ‘‘అయితే మీ అమ్మ...ఇప్పుడెక్కడుంది?’’‘‘తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ కూడా చచ్చిపోయింది. న్యూ ఇంగ్లండ్ నించి వచ్చిన ఒక వర్తకుడిపైన కోపం వచ్చి అరుస్తూ, ఆ ఉద్రేకంలో ఒక రక్తనాళం పగడలం వల్ల చనిపోయింది. ఈమాట విన్న మీదట రిప్ ముఖంలోని ఆరాటం కొంత ఉపశమించింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు.
‘‘తల్లీ! నేనే మీ నాన్ననమ్మా! గుర్తు పట్టలేవా?’’ అని అరిచాడు. దాంతో, అంతా దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఇంతలో ఒక మూడు కాళ్ల ముసలి అవ్వ కళ్లకి చెయ్యి అడ్డుపెట్టుకొని చూస్తూ ‘‘అయ్యో! ఇంకా సందేహమేమిటి? రిప్ అన్నయ్యే! రా అన్నయ్యా! రా....ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనపడ్డావ్ అన్నయ్యా! ఇంతకీ ఎక్కడున్నావు ఇన్నాళ్లనించీ’’ అంటూ ఆయాసం వచ్చేటంత సంభ్రమంతో అనేసింది.‘‘ఆ ఇరవై సంవత్సరాలు నాకు ఒక్క రాత్రి నిద్రలో గడిచిపోయినయి’’ అంటూ రిప్ నిట్టూర్చి తన కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడి వాళ్లంతా, కళ్ళింతవి చేసుకుని ఆ చిత్రకథంతా విన్నారు.ఒకరి ముఖాలొకరు చూసుకునే వాళ్లు కొందరు, ఈ పారవశ్యం కొంచెం ఉపశమించిన పిమ్మట ఆ టోపీపెద్దమనిషి కొంచెం నిదానించి చూశాడు. అదే సమయానికి రోడ్డు మీదనించి పోతున్న వృద్ధుడు పీటర్వాండెర్ డాంక్ అభిప్రాయం కనుక్కొని అలా చెయ్యడానికి అంతా తీర్మానించారు. అతడు ఆ రాష్ట్ర ప్రాచీన చరిత్ర రచించిన పీటర్ వాండెర్ డాంక్ వంశస్థుడు. ప్రస్తుతం అతడే ఆ గ్రామానికి వృద్ధ పితామహుడు. ఆయన రిప్ని తేలికగా గుర్తు పట్టాడు. అతడు చెప్పిన విషయాలన్నింటిని సంతృప్తికరగా ధ్రువపరిచాడు. కాట్స్ కిల్ పర్వతాలలో చిత్రవిచిత్ర వ్యక్తులు కనిపించేవారన్నమాట తాను తన పూర్వుల దగ్గర చాలాసార్లు విన్నట్టు ఆయన చెప్పాడు. అచటి హడ్సన్ నదినీ, ఆ ప్రాంతాన్నీ మొదట కనిపెట్టిన హెండ్రిక్ హడ్సన్ అనే మహా పురుషుడు ఇరవయేళ్ళ కొకసారి ఆ ప్రాంతానికి వచ్చి పోతూ ఉంటాడనీ, వచ్చి ఆ నదినీ, ఆ నది పేరుతోనే దాని ఒడ్డున ఏర్పడిన నగరాన్నీ సందర్శించడానికి హెండ్రిక్కీ, ఆయన ‘హాఫ్ మూన్’ పరివారానికీ అనుమతి ఉన్నదని కూడా తాను విన్నాడు.
‘‘ఇదంతా ఎందుకు? ఒక వేసవి సాయంకాలం పెద్ద ఉరుముల్లా వినిపించే వాళ్ల బంతులు దొరలిన చప్పుళ్లు నేనే స్వయంగా వినడం కూడా తటస్థించింది’’ అన్నాడు. ఇక కథ క్లుప్తంగా చెప్పేస్తాను. క్రమంగా ఆ గుంపులో జనమంతా చెదరిపోయి, అంతకంటే ఎక్కువ ముఖ్యమైన తమ ఎన్నికల పని చూసుకోటానికి వెళ్లిపోయారు. రిప్ కూతురు తండ్రిని వెంట బెట్టుకొని పోయి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆమెకు సంపన్నుడూ అయినా పెనిమిటీ, సర్వ సౌకర్యాలు గల మంచి ఇల్లూ ఉన్నాయి. తన అల్లుడు చిన్నతనంలో తన భుజాల మీద ఎక్కి ఆడుకున్న పొరుగు పిల్లలలో ఒకడని తెలిసి రిప్ సంతోషించాడు. రిప్ కొడుకూ, వారసుడూ అయినా చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రికి నకలుగా తయారయ్యాడు. ఒకచోట పొలం పనికి కుదిరాడు. అయితే, పూర్తిగా తండ్రికి పోలిక రావడం వల్ల, అతడు తన పని మినహా తక్కిన పనులు మాత్రమే చేస్తున్నాడు. రిప్ యథాప్రకారం పూర్వపు షికార్లు, ఇతర దైనందిన కార్యక్రమాలు ప్రారంభించాడు. వెనకటి స్నేహితులలలో మిగిలి ఉన్న వారందరితో మళ్ళీ తన పరిచయాలు పునరుద్ధరించుకున్నాడు. కాని వాళ్లందరిలో కాలం చాలా మార్పు తెచ్చింది. అందువల్ల అంతకన్నా కొత్త తరం వాళ్ళే మేలని,. కొందరు కొత్త స్నేహితుల్ని సంపాదించాడు. ఈ ముఠా అంతటికీ రిప్ గురువు. ఇంటి దగ్గర చేసేందుకు పని ఏమీ లేక పోడవం వల్లనూ, సోమరితనం దోషం కాని సుఖమయిన వయస్పు వచ్చినందువల్లనూ ఈ తడవ నిశ్చింతగా అతడు రోజూ సత్రం అరుగు మీద కొలువు తీర్చి గోష్ఠులు నడుపుతున్నాడు. ఆ గ్రామస్థులంతా అతణ్ణి ఆ గ్రామ పితామహుల్లో ఒకడుగా గౌరవిస్తున్నారు. యుద్ధానికి పూర్వపు రోజుల్లో సంగతులు వినడం కోసం వచ్చే పనీ పాటా లేని పడుచు వాళ్ళంతా ఆయనకు నిత్యసభాసదులు. అయినా, అతని ‘నిద్రాయుగం’లో జరిగిన విచిత్ర సంఘటనలన్నీ విని గ్రహించి, ఆనాటి మానవులలో ఒకడుగా చలామణీ అవడానికి అవసరమైన ప్రాతిపదిక పరిజ్ఞానం రిప్కి అటు తరువాత కొంత కాలానికి గాని అలవడలేదు.
దేశంలో చిన్న సంఘర్షణగా బయలుదేరిన విప్లవం క్రమంగా చినికి చినికి గాలివాన అయి పెద్ద యుద్ధంగా ఎలా పరిణమమించినదీ, దాని ఫలితంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పాత ఇంగ్లండు దేశీయుల పరిపాలన ఎలా తప్పిపోయిందీ తెలుసుకున్నాడు. వెనకటిలాగ, తాను జార్జి చక్రవర్తి ప్రజలలో ఒకడు కాడనీ, అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వతంత్ర పౌరుడనీ లీలగా గ్రహించాడు. రిప్ రాజకీయవేత్త కాడు.అందువల్ల రాజ్యాలు, సామ్రాజ్యాలూ తారుమారైనా ఆయనలో వచ్చే మార్పు ఏమీ లేదు. కాని, ఒక అధికార దౌర్జన్యాన్ని మాత్రం సహించలేక పోయేవాడు. అది ఎంతటి బాధాకరమో వెనక ఆయన స్వగృహంలో అనుదిన స్వానుభవ పూర్వకంగా గ్రహించినవాడు. అదృష్టవశాత్తు ఇప్పుడా దుర్దశ తప్పిపోయింది.‘పులి–మేక’ సంసారపు అగచాట్లు తప్పిపోయి, ఇప్పుడు భార్య ప్రళయ తాండవ భీతి లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాడు. అడపాదడపా ఆమె పేరు విన్నప్పుడు మాత్రం ఇప్పటికీ ఉలిక్కిపడి, భుజాలు కుంచించుకుని, కొంతసేపు అలాగే పైకి చూస్తూ ఉండిపోతాడు. మరి, అది తన విధిని తలచుకొని విచారపడడమో! జీవితంలో తనకు విమోచనం కలిగినందుకు ఆనందించడమో మాత్రం అర్థం కాదు.‘డూ లిటిల్’గారి హోటల్ దగ్గరికి వచ్చిన కొత్తవాళ్లందరికీ రిప్ తన కథంతా పూస గుచ్చినట్లు చెప్పేవాడు. మొదటి రోజుల్లో కొత్తగా కథ చెప్పినప్పుడల్లా కొద్ది కొద్ది మార్పులు ఉండేవి. చివరికి ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రూపంలోకి వచ్చి స్థిరపడిపోయింది. ఆ చుట్టప్రక్కలు ప్రాంతంలోని ఆబాలగోపాలనికీ ఈ కథ కంఠస్థం అయిపోయింది. ఇదంతా వాస్తవంగా జగలేదేమో అనీ, రిప్కి బహుశా మతిపోయి ఉండవచ్చుననీ, అతడు వెర్రిబాగుల వాడులాగ తిరుగుతుండడానికి అదే కారణమై ఉండవచ్చుననీ భావించే సంశయాత్ములు కూడా కొందరు లేకపోలేదు. ప్రాచీన డచ్ వలసదారులు మాత్రం ఈ కథంతా పూర్తిగా నిజమని నమ్మేవారు. ఎప్పుడు ఉరుములు వినిపించినా కాట్స్ కిల్ పర్వతాలలో హెండ్రిక్ హడ్సనూ, ఆయన పరివారం ‘నైన్ పిన్స్’ బంతాట ఆడుతున్నారని వారు పిల్లలకు చెపుతూండడం మామూలు. ఆ ప్రాంతంలో గయ్యాళి భార్యలతో బాధ పడే భర్తలంతా మరీ కష్టం తోచినప్పుడు, ‘‘రిప్ వాన్ వింకిల్ తాగిన డచ్ సారా నాకో గ్లాసెడు దొరికితే బ్రతికి పోదును’’ అని విలపిస్తూ ఉండటం కూడా పరిపాటి అయింది.
రెడ్ ఇండియన్ జానపద సాహిత్యం
మూలం : వాషింగ్టన్ ఇర్వింగ్
అనువాదం: బీ.వి.సింగరాచార్య