రిజర్వ్‌డ్ స్థలాల కబ్జా
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కోట్ల విలువ చేసే రిజర్వుడు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. లేఅవుట్లు వేసే సమయంలో ఉద్యానవనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుంటారు. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు సైతం చేపడుతున్నారు.
నెల్లూరు, సిటీ: నగరంలోని కోట్ల విలువ చేసే కార్పొరేషన్ రిజర్వుడు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆక్రమణదారులు అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో లేఅవుట్‌లు వేసే సమయంలో పది శాతం స్థలాలను కార్పొరేషన్‌కు కేటాయించాల్సి ఉంటుంది. పార్కులు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ రిజర్వుడు స్థలాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50శాతం రిజర్వుడు స్థలాలను కబ్జా చేశారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ అధికారుల వద్ద కూడా ఆ స్థలాలకు సంబంధించి పత్రాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన అరకొర స్థలాలపై కన్నేసిన అధికార పార్టీ వారు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఉద్యానవనాల కోసం కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురవడంపై నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకునే దిక్కులేదు
ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆక్రమణల విషయమై నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, టీపీఎస్‌లను కలిపి ఏడుగురిని సస్పెండ్‌చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో కొత్తగా అధికారులకు నియమించినా కేవలం 5 మంది మాత్రం విధుల్లో చేరారు. కొత్తగా వచ్చిన అధికారులకు నగరంపై అవగాహన లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది సహకారంతో ఆక్రమణదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
ఆక్రమణదారులకు అధికార పార్టీ అండదండలు
నగరంలోని బాలాజీనగర్ 13వ డివిజన్‌లో రెడ్డిఅండ్ రెడ్డి హెచ్‌పీ గ్యాస్ గోదాము సమీపంలోని రిజర్వుడు స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి ఏకంగా ఓ గదిని నిర్మించి ప్రహరీ సైతం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలను కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ అజీజ్ దృష్టికి తీసుకెళ్లినా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.