నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే..
నిజాం కాలంలో నిర్మించిన కత్వ శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరై సంవత్సరం దాటినా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. మూడు మండలాల్లోని పది గ్రామాలకు ప్రయోజనం కలిగించే ఈ కత్వ నిర్మాణానికి రైతులు ఎదురుచూస్తున్నారు.
మొయినాబాద్(చేవెళ్ల): వందేళ్ల క్రితం నిజాం పాలకులు హిమాయత్ సాగర్ జలాశయాన్ని నిర్మించారు. అదే సమయంలో ఈసీ వాగుపై మొయినాబాద్ మండలం వెంకటాపూర్ వద్ద, దానికింద శంషాబాద్ మండలంలోని మల్కారం వద్ద, మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ వద్ద కత్వలు నిర్మించారు. ఈసీవాగు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి కుడివైపు నుంచి పారుతూ హిమాయత్‌సాగర్ జలాశయంలో కలుస్తుంది. అప్పట్లో వాగు జీవనదిగా పారేది. దీంతో కత్వలు నిండి పైనుంచి పొర్లి నీరు కిందకు వెళ్లేది. కత్వ ఎగువ భాగంలో నిలిచిన నీటితో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగేవి. అప్పట్లో కత్వల వద్ద నిల్వ ఉండే నీటిని మోట ద్వారా రైతులు పంటపొలాలకు తరలించేవారు.
వెంకటాపూర్ వద్ద నిర్మించిన కత్వ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 ఎకరాలకు లబ్ధిచేకూరేది. కత్వకు కుడివైపు సుమారు మూడు కిలోమీటర్ల దూరం పెద్ద కాలువ ఉండేది. ఈ కాలువ ద్వారా శంషాబాద్ మండలంలోని రామంజాపూర్, కవేలిగూడ, మల్కారం, కేబీ దొడ్డి గ్రామాల్లోని సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందేది. అదే విధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి, షాబాద్ మండలంలోని చిన్నసోలిపేట్, పెద్దసోలిపేట్, హైతాబాద్ తదితర గ్రామాల రైతులు కత్వ ఎగువన నిల్వ ఉన్న నీటిని మోట ద్వారా పొలాలకు పారించుకునేవారు. 50 ఏళ్ల క్రితం వరకు ఆయా గ్రామాలకు సాగునీరు అందేది. అయితే కొంత కాలం క్రితం కత్వకు రంద్రాలు పడి నీటి నిల్వ తగ్గడంతోపాటు పంటకాల్వలు మూసుకుపోవడంతో నీటి పారుదల వ్యవస్థ దెబ్బతిన్నది. ఈసీ వాగు కూడా వరదలు వచ్చినప్పుడు మాత్రమే పారుతుండడంతో ఆయకట్టుకు నీరందకుండా పోయింది.
రూ.2.77 కోట్లు మంజూరు
వెంకటాపూర్ కత్వ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సంవత్సరం క్రితం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు ఇరిగేషన్ అధికారులు కత్వను పరిశీలించారు. కత్వ పునర్నిర్మాణం చేపడితే రైతులకు ఉపయోగపడుతుందని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కత్వ పునర్నిర్మాణంతోపాటు పంట కాలువల నిర్మాణానికి రూ.2.77కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరై సంవత్సరం దాటినా ఇప్పటి వరకు పనలు మొదలు కాలేదు. నిధులు మంజూరు చేయడంతో సంతోషించిన రైతులు ఇంకా పనులు మొదలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే కత్వ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
భూగర్భజలాలు పెరుగుతాయి
వెంకటాపూర్ కత్వ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వాగులు పారినా నీళ్లు నిల్వ ఉండడం లేదు. కత్వ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. కత్వ పునర్నిర్మాణం జరిగితే సాగునీరు అందడంతోపాటు పరిసర ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. – మాణెయ్య, మాజీ సర్పంచ్, శ్రీరాంనగర్
టెండర్ ప్రక్రియలో ఆగింది
వెంకటాపూర్ కత్వ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.77 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబందించి టెక్నికల్ సాంక్షన్ వచ్చింది. టెండర్ ప్రక్రియలోనే ఆగిపోయింది. ఎందుకు ఆగిందనే విషయం పూర్తిగా తెలియదు. దానిని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనిల్, ఇరిగేషన్ ఏఈ, మొయినాబాద్