తెలంగాణ: మహిళలకు లక్కీ చాన్స్! గురుకుల కొలువుల్లో వారికే అధికం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల జాతరతో మహిళలకే ఎక్కువ లబ్ధి కలగనుంది. ఈనెల 5వ తేదీన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో 9,231 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనుంది. తొలుత వెబ్నోట్లను విడుదల చేసిన టీఆర్ఈఐఆర్బీ... ప్రస్తుతం పూర్తిస్థాయి నోటిఫికేషన్లు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా విడుదల చేసిన ఏడు నోటిఫికేషన్లకు సంబంధించి 5,081 ఉద్యోగాలున్నాయి. ఇందులో జనరల్ కేటగిరీలో 1062 ఖాళీలుండగా... మహిళలకు ఏకంగా 4019 పోస్టులు రిజర్వ్ అయ్యాయి.
79.1శాతం కొలువులు వారికే...
సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలన్నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే కేటాయించినప్పటికీ స్త్రీలకే ఎక్కువ కొలువులు దక్కనున్నాయి. తాజాగా విడుదలైన పూర్తిస్థాయి నోటిఫికేషన్లకు అనుగుణంగా 5,081 ఖాళీలకు సంబంధించి మహిళలకు 79.10శాతం, జనరల్ కేటగిరీలో 20.90శాతం పోస్టులు రిజర్వ్ అయ్యాయి. మహిళలకు కేటాయించిన పోస్టులు మహిళలకే దక్కనుండగా... అర్హత పరీక్షల్లో మెరిట్ సా«దించిన మహిళలకు జనరల్ కేటగిరీలోనూ కొలువులు దక్కనున్నాయి. ఇక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో బాలికల పాఠశాలలు, కళాశాలల్లోని కొలువులన్నీ స్త్రీలకు మాత్రమే కేటాయించే నిబంధన ఉంది.
దీంతో ఆ సంస్థల్లోని కొలువులు మహిళలకు మాత్రమే దక్కనున్నాయి. ఇకబాలుర పాఠశాలలు,కళాశాలలకు సంబంధించిన కొలువుల్లో 33శాతం రిజర్వేషన్ ద్వారా పోస్టులు కేటాయించారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ వరుస మొదటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో మొదటి వరుసలో ఎక్కువగా స్త్రీలకు రిజర్వ్ చేసిన పోస్టులే ఉండడంతో వారికి మరింత ఎక్కువ అవకాశం కలిగినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మ్యూజిక్ టీచర్లకు సంబంధించిన 124 ఖాళీలు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలో 4,020 ఖాళీలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు క్రాఫ్ట్ కేటగిరీలో మరో ఆరు ఖాళీల భర్తీపై స్పష్టత రానుంది.