నేనో అట్టర్‌ఫ్లాప్ ఎంపీని
నా మనస్సాక్షి అదే చెబుతోంది
– ప్రజలకు ఏమీ చేయలేకపోయా.. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా
– ఈ నెల 25 లేదా 26న నేరుగా స్పీకర్‌కు రాజీనామా అందజేస్తా
– దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులు మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు అలంకారప్రాయమే
– ప్రధాని, ముఖ్యమంత్రికి నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది
– అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25 లేదా 26న స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన తెలిపారు. అనంతపురంలోని తన స్వగృహంలో గురువారం జేసీ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుంది. నేను ఫెయిల్డ్ ఎంపీ అని నా మనస్సాక్షి చెబుతోంది. నేను అట్టర్‌ఫ్లాప్ ఎంపీని! నేను ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఎంపీగా కొనసాగాలి? అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నా! రాజకీయాల నుంచే తప్పుకోవాలని మొదట భావించా! అయితే పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్నా! నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి నేను ఫెయిల్ అయ్యా! 9 నెలలుగా ప్రజలకు ఉపయోపడకుండా, వారికి ఏమీ చేయకుండా ఉండటం ఇదే తొలిసారి! ఫెయిల్ అయిన తర్వాత పదవిలో కొనసాగడం న్యాయం కాదు. రాజీనామా చేద్దామని స్పీకర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా.. అందుబాటులోకి రాలేదు. అందుకే నేనే నేరుగా ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ను కలిసి రాజీనామా చేస్తా! నా కంటే బలమైన శక్తులు పనిచేస్తున్నాయని అనుమానం నాకు వచ్చింది. అవి ఏంటో మీకు(అధిష్టానానికి) నేను చెప్పాలా? ఇప్పటికే చాలాసార్లు వారితో ఈ విషయాలు చర్చించా! అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఆ బలమైన శక్తి ఏదో తెలుసుకోవాలి.
ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకారప్రాయమే!:
‘ఈ దేశంలో ఇద్దరే మంత్రులు ఉన్నారు. ఒకరు ప్రధాని, మరొకరు ముఖ్యమంత్రి. ఎంపీలు, ఎమ్మెల్యే అలంకారప్రాయమే. నరేంద్రమోదీ మంచి పనిచేస్తే ప్రతిపక్షంలో ఉన్నవారు శభాశ్ అనే పరిస్థితి లేదు. అలాగే విపక్షంలో ఉన్న సోనియా, మన్మోహన్ ఏదైనా సూచన చెబితే పరిగణలోకి తీసుకునే పరిస్థితిలో అధికారపక్షం లేదు. ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు నేరుగా ఎన్నికలు నర్విహించాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మాకొద్దు. 40 ఏళ్లు చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా ఈ మాటలు చెబుతున్నా. ఈ పదవులకు బై..బై.. పార్లమెంట్‌కు ఓ నమస్కారం! అరువుకొచ్చిన గాంధీలతో దేశానికి నష్టం వాటిల్లుతోంది.
వీరు దేశాన్ని వదిలి మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వారి పని వారు చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితుల్లో మరో పార్టీలోకి మారాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను అనంతపురం, తాడిపత్రిలో ఒక రైలు నిలపలేకపోతున్నా. ఇక ఎంపీగా నేను ఏం చేయగలను. తాడిపత్రికి తాగు, సాగునీరు రప్పించుకోలేకపోతున్నా. అందుకే తప్పు ఒప్పుకుంటున్నా. కేజ్రీవాల్‌ను చూసి ఇక్కడి నాయకులు ఆచరించాల్సిన అంశాలున్నాయి. ప్రజలకు ఒక మేసేజ్ ఇచ్చి దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అలాంటి మార్పులు ఇక్కడా జరగాలి. నీటి పారుదల శాఖను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండకూడదు. ఇది మంచిది కాదు.’ అన్నారు. తాను లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోంటే రాజీనామా వ్యవహారంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.