ఎన్95 మాస్క్‌లతోనే మేలు..
స్వైన్ ఫ్లూ... ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. హెచ్1 ఎన్1 వైరస్ నుంచి బయట పడాలంటే ఎన్95 మాస్క్ సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా..
* వైరస్‌ను అడ్డుకుంటుంది
* పలుచగా ఉంటే ఫలితం ఉండదంటున్న వైద్యులు
రెస్పిరేటర్ మాస్క్...
గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ను తట్టుకోవడానికి ఉపయోగించేదే రెస్పిరేటర్ మాస్క్. ఈ మాస్క్‌లు చాలా సూక్ష్మంగా ఉన్న వైరస్‌ను ఫిల్టర్ చేస్తుంది. మూతిని, ముక్కును పూర్తిగా కవర్ చేస్తుంది. ఎన్95 మాస్క్, 3ఎం మాస్క్, వెక్టర్ మాస్క్, ఫుల్ ఫేస్ మాస్క్ ఇలా పలు రకాలున్నాయి. అయితే హెచ్1 ఎన్1 వైరస్‌కు మాత్రం ఎన్95 మాస్క్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వారు దీన్ని అప్రూవ్ చేశారు.
నాలుగైదు లేయర్లతో...
ఎన్95 మాస్క్‌లోనూ పలు రకాలున్నాయి. నాలుగైదు లేయర్లలోనూ లభిస్తాయి. ఔటర్, ఇన్నర్, ఫిల్టర్, యాక్టివ్ లేయర్లు ఉంటాయి. ఇవి గాలిని ఫిల్టర్ చేసి పంపుతాయి. ముక్కు, మూతిని పూర్తిగా కవర్ చేస్తుంది. లాటిక్స్ ఫ్రీ (దూది కణాలు ఉండకుండా)గా ఉంటాయి. ఈ మాస్క్‌లు అందుబాటులో లేకపోతే కనీసం ప్రముఖ కంపెనీలు తయారు చేసిన సర్జికల్ యాంటి వైరల్ ఫేస్ మాస్క్‌లు వాడవచ్చు.
జాగ్రత్తగా తొడగాలి..
మాస్క్‌ను ఇష్టానుసారంగా వాడకూడదు. నిపుణులు సూచించిన విధంగా తగిలించుకోవాలి. మాస్క్‌కు ఉన్న రెండు రిబ్బన్లను తలకు వెనుక భాగంలో పైన, కింద వచ్చేలా తొడగాలి. చెవులకు ఆధారంగా తొడగ కూడదు.
ఆన్లైన్లో అమ్మకాలు...
మాస్క్‌లు బయటి మార్కెట్లో దొరకడం లేదు. దొరికినా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ స్టోర్లు ఫ్లూ వైరస్ మాస్క్‌లను సాధారణ ధరలకు అందుబాటులో ఉంచారు. అమెజాన్.కామ్, ఇబే.కామ్, స్నాప్‌డీల్.కామ్ తదితర ఆన్లైన్ స్టోర్లు రూ.89 నుంచి రూ.3,000 వరకు ధర ఉన్న మాస్క్‌లను ఉచితంగా డోర్‌డెలివరీ చేస్తున్నారు.
వైరస్ నుంచి రక్షణకు ఇలా చేయండి...
⇒ శరీరతత్వం ఆధారంగా వైరస్ ప్రభావం ఉంటుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటే వెంటనే దాడి చేస్తుంది.
⇒ షేక్‌హ్యాండ్ ఇవ్వకూడదు.
⇒ సన్నిహితంగా, అతి దగ్గరిగా ఉండి మాట్లాడుకోకూడదు.
⇒ రోజూ నాలుగు తులసి ఆకులు నమలాలి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
⇒ హ్యాండ్ కర్చీఫ్లో రెండు చుక్కల జిందాతిలిస్మాత్‌ను వేసి ఉంచుకోండి. అప్పుడప్పుడు దాన్ని పీల్చుతూ ఉండాలి.
⇒ మాస్క్ అందుబాటులో లేకపోతే ఈ కర్చీఫ్నే ముక్కుకు కట్టుకోండి. విక్స్ ఇన్హేలర్ ఒకటి దగ్గర ఉంచుకోండి.
⇒ పిల్లలకు జిందాతిలిస్మాత్ వేసిన ద్రావకాన్ని తాగించండి. వారి చేతులకు కొద్దిగా రాయండి.
⇒ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.