ముంబైని మెరిపిస్తా..!
- బీఎంసీ కమిషనర్ అజయ్ మెహతా వ్యాఖ్య
- సోమవారం బాధ్యతల స్వీకారం
సాక్షి, ముంబై: ముంబైని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) అజయ్ మెహతా అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ గా సోమవారం ఆయన పదవీ బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎంసీ పరిధిలో అనేక ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వీటిని మరింత సమర్థంగా వాడుకుంటామని చెప్పారు. ముంబై అభివృద్ధి ప్రణాళికకు మద్దతు పలికి వివాదాల్లో చిక్కుకున్న కమిషనర్ సీతారామ్ కుంటేను ఆదివారం బదిలీ చేశారు.
ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి అజయ్ మెహతాను నియమించారు. 1984 బ్యాచ్‌కి చెందిన అజయ్ మెహతా 1990లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అహ్మద్‌నగర్ జిల్లా అధికారిగా, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.
2017 ఎన్నికల కోసమే?
2017లో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు భావిస్తున్నారు. బీఎంసీ కమిషనర్‌గా కుంటే మూడేళ్ల పదవి కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. అయితే ఇజ్రాయిల్ పర్యటనకు ముందే కుంటేను సీఎం ఫడ్నవీస్ బదిలీ చేసినట్టు సమాచారం. శివసేన సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న ముంబై అభివృద్ధి ప్రణాళిక అంశంపై గత కొన్ని రోజులుగా దుమారం లేచిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికకు కుంటే మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో నియమితులైన కుంటేను బదిలీ చేయడం ఖాయమని ఊహాగానాలు వచ్చాయి.