వీధి వెలుగులు ఎప్పుడో?
మరికొన్నాళ్లు అంధకారంలోనే నగరం
నష్టంపై అంచనాకు రాని జీవీఎంసీ
చేతులెత్తేస్తున్న కాంట్రాక్టు సంస్థలు
సాక్షి, విశాఖపట్నం: ‘హుదూద్’ దెబ్బకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో వారం రోజులుగా నగరంలో అంధకారం రాజ్యమేలుతోంది. మహా నగరపాలకసంస్థ మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీం తో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా ఇప్ప ట్లో వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేదు. మహా నగరం పరిధిలో 23 వేల వరకు వీధి దీపాలున్నాయి. వీటిలో మోడరన్ లైట్లతో పాటు హై మాస్ట్, సోడియం
వేపర్(ఎస్వీ) ల్యాంప్స్, ట్యూబ్లైట్స్ ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత పూర్తిగా జీవీఎంసీదే.
ఎంపిక చేసిన కాం ట్రాక్టు సంస్థలకు రెండు మూడు డివిజన్ల పరిధిలోని వీధి దీపాల రోజు వారీ నిర్వహణను అప్పగించారు. హుదూద్ విధ్వంసంతో నగరంలో భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని స్తంభాలైతే ముక్కలు చెక్కలయ్యాయి. వేల లైట్లు డూమ్లతో సహా ఏమయ్యాయో తెలియని పరిస్థితి.
మరికొన్ని అష్టవంకర్లు తిరిగి పనికిరాకుండా పోయాయి. నేలకొరిగిన స్తంభాలకున్న వీధిదీపాల డూమ్లు, ఇతల విలువైన విద్యుత్ పరికరాలన్నీ తుఫాన్ మర్నాటే పెద్ద ఎత్తున అపహరణకు గురయ్యాయి. కానీ ఇవేమీ తమకు పట్టనట్టుగా జీవీఎంసీ అధికారులు మిన్నకుండిపోయారు. కనీసం నగర పరిధిలో వీధి దీపాల పరిస్థితి ఏమిటన్న దానిపై సమాచారమే కాదు.. కొత్తవి కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందో ప్రాథమిక అంచనాలు జీవీఎంసీ అధికారుల వద్ద లేవు.