restoration ponds
-
చెరువులకు మహర్దశ
ఖమ్మం అర్బన్: రైతులకు ఇది ఓ తీపి కబురు. సాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న రైతులను గట్టెక్కించేందుకుగాను చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయాలని, ఒక్కో చెరువుకు దాదాపు 50లక్షల రూపాయల వరకు వెచ్చించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. అంచనాల తయారీలో అధికారులు జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి చెరువులతోపాటు ఆ తర్వాత నిర్మించినవి కలిపి మొత్తం 4821 ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిలో అనేకం కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా పడున్నాయి. ఈ చెరువుల కింద దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉండవచ్చని అంచనా. వీటి పునరుద్ధరణలో భాగంగా కట్టల బలోపేతం, పూడిక తీత, తూములు-అలుగుల ఏర్పాటు, కాల్వలకు మరమ్మతు తదితర పనులను చేపడతారు. మేజ ర్, మైనర్, మీడియం చెరువులతోపాటు కుంటలను కూడా పునరుద్ధరిస్తారు. ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ ఐబీ డివిజన్ల పరిధిలోగల మొత్తం చెరువుల అభివృద్ధికిగాను ఇంజనీర్లు అంచనాలు తయారుచేస్తున్నారు. తొలి ఏడాదిలో జిల్లాలోని 960 చెరువులను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నవంబర్ 8 తేదీ నాటికి 480 చెరువుల పునరుద్ధరణకు అంచనాలు రూపొందించాలని, 22వ తేదీ నాటికి మిగిలిన వాటి (480) అంచనాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా అధికారులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. మట్టిని తరలించేందుకు రైతులు ముందుకొచ్చిన చెరువులకు తొలి ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. చెరువులోని మట్టిని తరలించేందుకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. జిల్లాలో ఐటీడీఏ పరిధిలోగల చెరువులను ఐబీ పరిధిలోకి బదలాయించి పునరుద్ధరిస్తారు. జిల్లాలో గుర్తించిన చెరువులను పునరుద్ధరించేందుకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అంచనాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియను నవంబర్ చివరి నాటికి పూర్తిచేసి, డిసెంబర్లో పనులు ప్రారంభించే దిశగా అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అనుకున్న ప్రకారంగా వచ్చే ఐదేళ్ల నాటికి జిల్లాలోని చెరువులన్నిటినీ పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే రైతుల ‘పంట’ పండినట్టేనని అధికారులు అంటున్నారు. -
పేదలందరికీ పక్కా
* అపోహలొద్దు.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు * సమగ్ర సర్వే, తాజా దరఖాస్తుల లక్ష్యమదే * ఐఏఎస్ అధికారుల కొరతతోనే ఇబ్బందులు * అయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం * నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట రూరల్: పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, అర్హులకే సంక్షేమ ఫలాలు అందివ్వాలన్న లక్ష్యంతోనే సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ, ఇటీవలే నిర్వహించిన సమగ్ర సర్వే లక్ష్యం కూడా అదేనన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా హరీష్‌రావు కోరారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు ఐఏఎస్‌ల కొరత ఎక్కువగా ఉందని, అందువల్లే సంక్షేమ పథకాల ప్రారంభంలో జాప్యం జరుగుతోందన్నారు. అయినప్పటికీ త్వరలోనే ఎన్నికల ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. సిద్దిపేట జిల్లాకే ఆదర్శం జిల్లాలో 90 నిర్మల్ పురస్కార్ పొందిన గ్రామాలుంటే, అందులో 50 గ్రామాలు సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎన్నికై జిల్లాకే సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే గ్రామాల్లోని ఇళ్లల్లో, వీధి దీపాల్లో ఎర్రబుగ్గలు తొలగించి, సీఎఫ్ఎల్ బల్బులు వాడాలన్నారు. దీంతో విద్యుత్‌ను ఆదా చేయడమే కాక బిల్లులు కూడా తక్కువగా వస్తాయన్నారు. గ్రామాల్లో ఇంటి పన్ను, నల్ల బిల్లు వసూల్లో సర్పంచ్‌లు చాలా వెనకబడి ఉన్నారని, దాన్ని అధిగమించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారని త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షులు శ్రీహరిగౌడ్, ఎంపీడీఓ ప్రభాకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర అధికారులు తదితరలు పాల్గొన్నారు.