ఖమ్మం అర్బన్: రైతులకు ఇది ఓ తీపి కబురు. సాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న రైతులను గట్టెక్కించేందుకుగాను చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయాలని, ఒక్కో చెరువుకు దాదాపు 50లక్షల రూపాయల వరకు వెచ్చించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
అంచనాల తయారీలో అధికారులు
జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి చెరువులతోపాటు ఆ తర్వాత నిర్మించినవి కలిపి మొత్తం 4821 ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిలో అనేకం కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా పడున్నాయి.
ఈ చెరువుల కింద దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉండవచ్చని అంచనా.
వీటి పునరుద్ధరణలో భాగంగా కట్టల బలోపేతం, పూడిక తీత, తూములు-అలుగుల ఏర్పాటు, కాల్వలకు మరమ్మతు తదితర పనులను చేపడతారు. మేజ ర్, మైనర్, మీడియం చెరువులతోపాటు కుంటలను కూడా పునరుద్ధరిస్తారు.
ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ ఐబీ డివిజన్ల పరిధిలోగల మొత్తం చెరువుల అభివృద్ధికిగాను ఇంజనీర్లు అంచనాలు తయారుచేస్తున్నారు.
తొలి ఏడాదిలో జిల్లాలోని 960 చెరువులను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నవంబర్ 8 తేదీ నాటికి 480 చెరువుల పునరుద్ధరణకు అంచనాలు రూపొందించాలని, 22వ తేదీ నాటికి మిగిలిన వాటి (480) అంచనాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా అధికారులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
మట్టిని తరలించేందుకు రైతులు ముందుకొచ్చిన చెరువులకు తొలి ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. చెరువులోని మట్టిని తరలించేందుకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
జిల్లాలో ఐటీడీఏ పరిధిలోగల చెరువులను ఐబీ పరిధిలోకి బదలాయించి పునరుద్ధరిస్తారు.
జిల్లాలో గుర్తించిన చెరువులను పునరుద్ధరించేందుకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.
అంచనాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియను నవంబర్ చివరి నాటికి పూర్తిచేసి, డిసెంబర్‌లో పనులు ప్రారంభించే దిశగా అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అనుకున్న ప్రకారంగా వచ్చే ఐదేళ్ల నాటికి జిల్లాలోని చెరువులన్నిటినీ పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే రైతుల ‘పంట’ పండినట్టేనని అధికారులు అంటున్నారు.
చెరువులకు మహర్దశ
Published Wed, Nov 5 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement