జక్కంపూడిలో రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ
– 175 టు 184 సర్వే నెంబర్ల వరకు ఓకే
– 157, 161–170పై ఆంక్షలే
– కీలక సమీక్షలో కలెక్టరు బాబు వెల్లడి
విజయవాడ:
జక్కంపూడి ప్రాంతంలో నిలుపుదల చేసిన స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్దరించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో సెక్షన్ – 22పై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వాస్తవ యజమానులకు ఎటువంటి సమస్యా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జక్కంపూడి పరిధిలో 157, 161 నుంచి 170 (162 సర్వే నంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 సర్వే నంబర్లలో భూములను రిజిస్ట్రేషన్లను చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
నగరపరిధిలో 655 ఎకరాల్లో...
విజయవాడ నగర పరిధిలో 655 ఎకరాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతామని కలెక్టరు తెలిపారు. నగరంలో విఎంసీ, సీఆర్డిఏ తదితర శాఖలకు చెందిన సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లకు యోగ్యమైన వాటికి అనుమతులు ఇచ్చేస్తామన్నారు. మిగిలిన పెండింగులో ఉన్న సర్వే నంబర్లలో భూములను కూడా సర్వే జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపైన, భూముల కేటాయింపుల పైన చర్యలపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జక్కంపూడి ఫార్మర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సూచించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అక్టోబర్ 4వ తేదీన జక్కంపూడి ప్రాంతంలో అధికార బృందంతో పర్యటిస్తానని కలెక్టర్ చెప్పారు. జక్కంపూడి పరిధిలో 711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలిగాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గంధం చంద్రుడు, సబ్–కలెక్టర్లు జి. సృ జన, లక్ష్మీశా, రిజిస్ట్రేషన్ అధికారులు జి. బాలకృష్ణ, శ్రీనివాసరావు, శివరాం, తహశీల్దార్లు ఆర్. శివరావు, మదన్మోహన్లు పాల్గొన్నారు.