22న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు!
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ఈనెల 22న విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల వెల్లడి కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పంపించిన ఫైలు ఆమోదం పొందినట్లు తెలిసింది. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈనెల 28న వెల్లడించే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,251 కేంద్రాల్లో గత నెల 9 నుంచి 27 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తం 9,73,237 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,06,789 మంది ఉన్నారు. మరోవైపు పదో తరగతి పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో వెల్లడించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీలైతే మే 11 లేదా 12న ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.