ఆన్‌లైన్‌లోనూ చౌక ‘బేరం’
♦ కూపన్ల నుంచి పేమెంట్ల వరకూ ఆఫర్లు
♦ ఆదా చేయటానికి రకరకాల మార్గాలు
► షాపుకెళ్లి ఏదైనా కొనాలంటే... ముందు వస్తువు చూస్తాం. ధర అడుగుతాం. బేరమాడతాం. కొందరైతే... బేరమాడుతూనే ఉంటారు. ఎందుకంటే... బేరం చేసి కొనటమంటే అదో తృప్తే.
► మరి ఆన్లైన్ షాపింగ్ చేసేవారు ఈ తృప్తిని మిస్సవరా అంటే... కచ్చితంగా అవుతారు. ఎందుకంటే అక్కడంతా ఫిక్స్డ్ మయం. ఆన్లైన్లో ఒక ధర చూస్తే... దాన్ని చెల్లించాల్సిందే. మరి ఆ ధరను ఇంకా తగ్గించాలంటే...?
► ఆన్లైన్లో చెప్పిన ధర కన్నా తక్కువకు పొందటానికి చాలా చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే బయటి కన్నా చాలా తక్కువ ధరకే కొన్నామన్న తృప్తి మిగులుతుంది. ఈ ఆన్లైన్ చిట్కాలు ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’ పాఠకుల కోసం...
సరదా కోసం షాపింగ్ చేయొద్దు
కాలక్షేపం, సరదా కోసం ఈ-కామర్స్ సైట్లలో విహరించడం అంత మంచిది కాదు. మీకు ఒక వస్తువుతో నిజంగానే అవసరం ఉంటే అప్పుడు దాని కోసం షాపింగ్ చేయండి. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా రిటైలర్లు వినియోగదారులను ఆకర్షించడానికి మనీ బ్యాక్ గ్యారంటీ, రిప్లేస్మెంట్ గ్యారంటీ, ధరల డిస్కౌంట్ వంటి పలు రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఒక క్లిక్‌తో వస్తువులను కొనేలా చేస్తున్నాయి. షాపింగ్ సమయంలో ముందుగా నిర్దేశించుకున్న అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి.
‘బయ్ హట్కే’ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే..
మీరు డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్... ఇలా దేని నుంచైనా షాపింగ్ చేయండి. కాకపోతే ‘బయ్ హట్కే’ యాప్‌ను మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. డెస్క్‌టాప్‌లో అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను దీని ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఫోన్‌లోనైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఈ కామర్స్‌లో ఏ వస్తువు కొంటున్నా... అది ఇంకా తక్కువ ధరకు ఏ సైట్లో దొరుకుతుందో ఈ బయ్హట్కే ఎక్స్టెన్షన్ మీకు అక్కడే చూపిస్తుంటుంది.
దాంతో మీరు ఏ సైట్ సదరు వస్తువును తక్కువ ధరకు ఆఫర్ చేస్తోందో అక్కడే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరొక వెబ్సైట్లో ఒక మొబైల్ ఫోన్‌ను రూ.9,800 దగ్గర కొందామనుకున్నారు. కానీ మరో సైట్లో అదే మొబైల్‌ను రూ.8,800కు దొరుకుతోందని బయ్హట్కే ఎక్స్టెన్షన్ చూపించిందనుకోండి. నిక్షేపంగా సదరు వెబ్‌సైట్‌ను విజిట్ చేసి తెలుసుకోవచ్చు. అలా... తక్కువ ధరకు వస్తువు ఎక్కడ దొరుకుతోందో తెలుసుకుని కొనుక్కోవచ్చు. కాగా వీలైతే ఒక వస్తువు ధరను తెలుసుకోవడానికి పలు రకాల వెబ్సైట్లను వెదకాలి. జంగ్లీ.కామ్ వంటి సైట్లలో ఒక వస్తువు ధర వివిధ వెబ్‌సైట్స్‌లో ఎలా ఉందో ఒకేచోట తెలుసుకోవచ్చు.
పండుగ సీజన్లలో షాపింగ్ చేయండి
ఇంకా కొన్ని చేయొచ్చు. కంపెనీలు సాధారణంగా పండుగ రోజుల్లో పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఇదే విధంగా ఆన్లైన్ షాపింగ్ సంస్థలూ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడానికి దీపావళి, దసరా, రంజాన్ వంటి పండుగ రోజులతో పాటు ఇండిపెండెన్స్ డే వంటి ప్రత్యేక దినాల్లో కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాబట్టి మీరు మీ షాపింగ్‌ను వీలైనంత వరకు ఈ పండుగ రోజుల్లో చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో షాపింగ్ ఫెస్టివల్ మేళాలు కూడా నిర్వహిస్తున్నాయి.
క్రెడిట్, డెబిట్‌కార్డులతో క్యాష్‌బ్యాక్
ఇక చివరిగా చెల్లింపులు చేసేటపుడు కాస్త ఆలోచించాలి. మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. ఎందుకంటే చెల్లింపులు అధికంగా తమ బ్యాంకుల నుంచే జరగాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్లైన్ షాపింగ్ చేస్తే అవి మనకు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఆన్లైన్ పేమెంట్ చేస్తే.. అమెజాన్ 10 శాతం, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డుతో చెల్లింపులు జరిపితే స్నాప్‌డీల్ అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. నిజానికి ప్రతి బ్యాంకూ ఏదో ఒక సైట్‌తో ఒప్పందం చేసుకుందనేది కాదనలేని నిజం.
కొంచెం కష్టపడి... కూపన్లు వెదకండి
కావాల్సిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతోందో తెలిసింది. మరి ఆ ధరకు కొనేయాలా? ఇంకా తగ్గుతుందా!! ఇది తెలుసుకోవటానికి కాస్త కూపన్లు అందించే సైట్లను వెదకాలి. ఇపుడు దాదాపు ఈ-కామర్స్ సంస్థలన్నీ కూపన్లు అందించే వెబ్సైట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ కూపన్ల సంస్థలు రకరకాల ఆఫర్లతో కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వెబ్‌సైట్స్ పలు రకాల కూపన్లను ఆఫర్ చేస్తున్నాయి. కూపన్ దునియా, కూపన్జ్గురు, కూపన్నేషన్ సహా పలు వెబ్సైట్ల ద్వారా ఇవి అందుబాటులో ఉన్నాయి.
ప్రైస్ అలర్ట్స్తో ఎంతో మేలు
హడావుడిలో ఉండో... లేక ఈ వస్తువును ఇప్పుడే ఏం కొంటాంలే ధర తగ్గాక చూద్దాం అని భావించో కొనుగోలును వాయిదా వేసుకోవచ్చు. కానీ ధర ఎప్పుడు తగ్గుతుందో మీకు తెలియదు. అప్పుడేం చేయాలి? ఇలాంటి సమయాల్లో మీరు ప్రైస్ అలర్ట్స్ కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు కొనాలి అని భావించిన వస్తువు ధర తగ్గినప్పుడు ఆ వెబ్‌సైట్స్ నుంచి మీకు ధరకు సంబంధించిన ఈ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు వస్తాయి. ఉదాహరణకు మీరు ఈ సమయంలో కొనాలి అని భావించే వస్తువు ధర రూ.5,000గా ఉందనుకోండి. కానీ మీరు ఆ వస్తువు ధర కచ్చితంగా రూ.4,700కు తగ్గుతుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు మీరు ప్రైస్ అలర్ట్స్‌కు నమోదు చేసుకుంటే... ధర తగ్గినప్పుడు ఆ వెబ్‌సైట్స్ మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాయి.
కార్ట్‌లో వస్తువులను యాడ్ చేసి ఉంచండి
మీరు ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వస్తువులను వెంటనే కొనకుండా షాపింగ్ కార్ట్‌లో యాడ్ చేసి ఉంచడం మరో పద్ధతి. వాటిని కొన్ని రోజుల పాటు అలాగే వదిలేయండి. ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థలు ఈ విధంగా వస్తువులను కొనకుండా కార్ట్‌లో యాడ్ చేసి వదిలేసిన అంశంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే ఇలా కార్ట్‌లో యాడ్ అయిన వస్తువుల్లో దాదాపుగా 2/3 వంతు అమ్మకాలు నిలిచిపోతున్నాయి. అలాంటపుడు ఈ-కామర్స్ సంస్థలు వాటి ధరలు తగ్గాయని, మీరు కొనుగోలు చేయొచ్చని ప్రైస్ అలర్ట్స్ పంపిస్తున్నాయి.
వాలెట్‌తో పేమెంట్స్ చేయండి
ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకు సాధారణంగా అధిక డిస్కౌంట్లు కూపన్ల ద్వారానే లభిస్తాయి. అలానే కాకుండా ఈ-వాలెట్స్ ద్వారా కూడా మనం అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. మీకు డిస్కౌంట్ లభించని పక్షంలో ఈ-వాలెట్ చెల్లింపు ద్వారా కచ్చితంగా క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఉదాహరణకు మీరొక సినిమా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను చూడండి.. మీరు పది సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉందనుకోండి. మీరు ఆ పది టికెట్లను ఒకేసారి బుకింగ్ చేసుకునేదానికి బదులు, ఒక్కొక్క దాన్ని ఒకసారి అంటే పదిసార్లు టికెట్లను బుకింగ్ చేసుకుంటే అ వెబ్సైట్ మీకు కచ్చితంగా అదనపు డిస్కౌంట్‌ను అందిస్తుంది.
షాపింగ్‌కు పలు రకాల మెయిల్స్ వాడండి
దాదాపుగా ప్రతి కంపెనీ కూడా కొత్త వినియోగదారులకు పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. మీరు మొదటిసారి ఒక సైట్లో రిజిస్టర్ అయితే ఆ సైట్ సంస్థ మీకు ఈ-మెయిల్స్ ద్వారా కూపన్ కోడ్స్‌ను ఆఫర్ చేస్తుంది. దీనికి ఫుుడ్పాండా, ఓలా క్యాబ్స్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మరిన్ని కంపెనీలు మొబైల్ యాప్ ద్వారా ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇక్కడ మెయిల్స్లాగా ఎక్కువ మొబైల్ నెంబర్లను ఉపయోగించడానికి ఆస్కారం లేదు.
క్యాష్‌కరో.కామ్‌తో అదనపు క్యాష్‌బ్యాక్
మీరు కూపన్లు, వాలెట్స్ వంటి పలు రకాల మార్గాల్లో డిస్కౌంట్ పొందినప్పటికీ కూడా క్యాష్‌కరో.కామ్ లింక్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరికొంత క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌కరో.కామ్ అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఆ వెబ్సైట్ లింక్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. విక్రయ సంస్థ నుంచి ఈ వెబ్సైట్ కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో పొందుతుంది.
ఇన్‌కాగ్నిటో మోడ్ తో బ్రౌజింగ్ చేయండి
కొన్ని కంపెనీలు వారి పాత వినియోగదారులకు ఎలాంటి ఆఫర్లను అందించవు. అలాంటి సమయంలో మీరు మీ బ్రౌజర్లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఆన్‌చేసి షాపింగ్ చేయండి. అప్పుడు ఎవరు బ్రౌజింగ్ చేస్తున్నదీ ఆ కంపెనీలకు తెలియదు. అప్పుడు ఆ కంపెనీలు మీరు పాత కస్టమర్ అయినప్పటికీ కూడా కొత్త కస్టమర్‌గా భావించి మీకు ఆఫర్లను అందిస్తాయి.