Retired headmaster
-
కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి
సాక్షి, నెల్లూరు: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య.. ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న వీడియోతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీణించగా, కోట ప్రభుత్వాసుపత్రిలో ఆయన చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు. చదవండి: వారెప్పటికీ అనాథలు కారు..! వావివరుసలు మరిచి.. ఆకర్షణకు లోనై.. -
అ‘విశ్రాంత’ ఉపాధ్యాయులు
‘సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసిన మదర్ థెరిస్సా. కొందరు చేసే సేవలను చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది. ఉద్యోగ విరమణ పొందినా ముగ్గురు ఉపాధ్యాయులు తాము పని చేసిన పాఠశాలల్లోనే విద్యా బోధన చేస్తూ.. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సాక్షి, రాజంపేట టౌన్ : రాజంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హెచ్ఎంలు, ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాము పని చేసిన పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తూ సేవాతత్పరతను చాటుతున్నారు. రిటైర్డ్ అయ్యే చాలా మంది ఉపాధ్యాయులు శేష జీవితాన్ని తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలో.. ముందే ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు, ఎగువగడ్డకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం వనం ఎల్లయ్య, ఎగువగడ్డ ప్రాంతానికే చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు హెప్సీబ ఉద్యోగ విరమణ పొందినా తమ శేష జీవితాన్ని మాత్రం విద్యార్థులతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులు కావడంతో.. వారి ఉన్నతి కోసం తోడ్పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువులకు వందనం రిటైర్డ్ హెచ్ఎం యు.సుబ్బరాయుడు తుమ్మల అగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ 2017లో ఉద్యోగ విరమణ పొందారు. వనం ఎల్లయ్య ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, హెప్సీబ మండలంలోని వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు అదే పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. హెప్సీబ రాజంపేట పట్టణం నుంచి వెంకటరాజంపేటకు తన సొంత ఖర్చుతో ఆటోలో వెళ్లి విద్యార్థులకు బోధన చేస్తుండటం విశేషం. వీరికి వందనం అని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. దేవుడిచ్చిన వరం సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనది. నాకు ఉపాధ్యాయ వృత్తి లభించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. అందువల్లే నేను ఉద్యోగ విరమణ పొందినా భగవంతుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల ఉన్నతికి వినియోగిస్తున్నా. – యు.సుబ్బరాయుడు,రిటైర్డ్ హెచ్ఎం, టి.అగ్రహారం పేద విద్యార్థులతోనే శేష జీవితం రెండున్నర దశాబ్దాల పాటు పేద విద్యార్థులతో నా జీవితం సాగింది. శేషజీవితం కూడా వారితోనే కొనసాగించాలన్నదే నా కోరిక. అందువల్ల నేను రిటైర్డ్ అయినా పేద విద్యార్థులకు ఉచితంగా బోధించాలని నిర్ణయించుకున్నా. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. – వనం ఎల్లయ్య, రిటైర్డ్ హెచ్ఎం, ఎగువగడ్డ, రాజంపేట శరీరం సహకరించినంత వరకు.. నేను వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లు ఉపాధ్యాయురాలిగా పని చేశాను. ఇక్కడి విద్యార్థులు, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. నాకు శరీరం సహకరించినంత వరకు ఈ గ్రామంలోని విద్యార్థులకు సేవ చేస్తా. – హెప్సీబ, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, ఎగువగడ్డ గొప్ప విషయం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించడం చాలా గొప్ప విషయం. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉండే పాఠశాలల్లో ఇలా బోధిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – మేడా చెంగల్‌రెడ్డి, ఎంఈఓ, రాజంపేట -
కీచక గురువులకు రిమాండ్
చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన వక్కలగడ్డకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచర్‌ను ఆదివారం అవనిగడ్డలోని ఏజేఎఫ్‌సీఎంఈ జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థిని రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామప్రసాద్, అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ చిరువోలు జనార్దనప్రసాద్‌ను లైంగికదాడి, పోస్కో చట్టాల కింద శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో అవనిగడ్డలో ని మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం కీచక గురువు అరెస్ట్ ఉదంతాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్ని పలువురు మహిళా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల మహిళా నేతలు అదివారం చల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులిద్దరిపై వైఎస్సార్సీపీ మండల మహిళా కన్వీనర్ వల్లూరి ఉమ, నాయకురాలు బొందలపాటి లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కఠినంగా శిక్షించాలి విద్యార్థిని మృతికి కారకులైన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు వల్ల విద్యార్థినులు చదువు కోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. - వల్లూరి ఉమ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, చల్లపల్లి అవార్డును వెనక్కి తీసుకోవాలి ఈ కేసులో తాతయ్య వయస్సు అయిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామ ప్రసాద్‌కు గతంలో వచ్చిన జాతీయ ఉత్తమ అవార్డును వెనక్కి తీసుకోవాలి. మరో ఉపాధ్యాయుడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని జీవితాన్ని సగంలోనే బుగ్గిపాలు చేసిన ఈ ఇద్దరినీ కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలి. - బొందలపాటి లక్ష్మి,వైఎస్సార్సీపీ నాయకురాలు, చల్లపల్లి -
‘కీచక’ టీచర్ల అరెస్ట్
నిందితుల్లో ఒకరు రిటైర్డ్ {పధానోపాధ్యాయుడు, మరొకరు ఇంగ్లిష్ టీచర్ ‘పోస్కో’ కింద కేసు నమోదు చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చల్లపల్లి : జిల్లాలో సంచలనం కలిగించిన చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికి కారకులైన రిటైర్డ్ హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని మరణం విషయం గతంలో తమ దృష్టికి రాలేదని, దీనిపై బాధిత కుటుంబీకులు కూడా ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తల అనంతరం ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ ఎం.అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరిపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు. శారీరక సంబంధాలతోనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి వక్కలగడ్డకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని(16)ని గతంలో అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మల్లుపెద్ది శివరామప్రసాద్, ప్రస్తుతం ఇదే పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిరువోలు జనార్దనప్రసాద్ లోబరచుకుని పలుసార్లు శారీరకంగా సంబంధాలు కొనసాగించినట్టు కేసు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. మైనర్ అయిన ఆ విద్యార్థినిని వారు శారీరకంగా ఎక్కువసార్లు కలవడం వల్ల అనారోగ్యానికి గురైందని చెప్పారు. బాలికను ముందుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి తీసుకెళ్లిపొమ్మని చెప్పారన్నారు. తరువాత మరో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గత అక్టోబర్ 17న మరణించినట్టు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసుపై ప్రాథమిక విచారణలో ఈ విషయాలు రుజువైనట్టు చెప్పారు. ఈ మేరకు లైంగికదాడి, పోస్కో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్టు) కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ ఆదివారం అవనిగడ్డలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. సమావేశంలో సీఐ దుర్గారావు, ఎస్సై వై.సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏబీవీపీ ఫిర్యాదుతో... వక్కలగడ్డ జెడ్పీ హైస్కూల్లో పీఈటీ ఓ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్ 17న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు శివరామప్రసాద్ వల్ల ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని చనిపోయిందని, దీనిపై విచారణ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై మూడురోజుల తరువాత డీవైఈవో విచారణకు రాగా.. కొంతమంది నాయకుల ఒత్తిళ్ల మేరకు గతంలో ఆరోపణలు చేసిన నాయకులు విచారణకు హాజరు కాలేదు. అప్పట్లో ‘సాక్షి’లో దీనిపై కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వీటిపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై తాజాగా నాలుగురోజుల నుంచి పత్రికల్లో పలు కథనాలు రావడం, ఏబీవీపీ ఆందోళన, కేసు నమోదు, ఎస్ఎఫ్ఐ ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలతో విద్యార్థిని మృతి ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు సీఐ దుర్గారావు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ ఆదేశాలు మేరకు రిటైర్డ్ హెడ్మాస్టర్, ఇంగ్లిష్ టీచర్‌ను శనివారం అరెస్టు చేశారు. బాలల పరిరక్షణ జిల్లా అధికారి విచారణ శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ జిల్లా అధికారి విజయకుమార్ వక్కలగడ్డ హైస్కూల్లో శనివారం పలువురు ఉపాధ్యాయులు, సీఐ దుర్గారావు నుంచి, స్థానిక పోలీస్ స్టేషన్లో జనార్దన ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థిని మృతి ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ విచారణ నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల పాల్గొన్నారు.