‘కీచక’ టీచర్ల అరెస్ట్ | Responsible for the death of a student, a retired headmaster | Sakshi
Sakshi News home page

‘కీచక’ టీచర్ల అరెస్ట్

Published Sun, Dec 7 2014 1:30 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

‘కీచక’ టీచర్ల అరెస్ట్ - Sakshi

‘కీచక’ టీచర్ల అరెస్ట్

నిందితుల్లో ఒకరు రిటైర్డ్ {పధానోపాధ్యాయుడు,
మరొకరు ఇంగ్లిష్ టీచర్
‘పోస్కో’ కింద కేసు నమోదు

 
చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
 
చల్లపల్లి : జిల్లాలో సంచలనం కలిగించిన చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికి కారకులైన రిటైర్డ్ హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని మరణం విషయం గతంలో తమ దృష్టికి రాలేదని, దీనిపై బాధిత కుటుంబీకులు కూడా ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తల అనంతరం ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ ఎం.అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరిపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు.
 
శారీరక సంబంధాలతోనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి

వక్కలగడ్డకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని(16)ని  గతంలో అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మల్లుపెద్ది శివరామప్రసాద్, ప్రస్తుతం ఇదే పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిరువోలు జనార్దనప్రసాద్ లోబరచుకుని పలుసార్లు శారీరకంగా సంబంధాలు కొనసాగించినట్టు కేసు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. మైనర్ అయిన ఆ విద్యార్థినిని వారు శారీరకంగా ఎక్కువసార్లు కలవడం వల్ల అనారోగ్యానికి గురైందని చెప్పారు. బాలికను ముందుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి తీసుకెళ్లిపొమ్మని చెప్పారన్నారు. తరువాత మరో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గత అక్టోబర్ 17న మరణించినట్టు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసుపై ప్రాథమిక విచారణలో ఈ విషయాలు రుజువైనట్టు చెప్పారు. ఈ మేరకు లైంగికదాడి, పోస్కో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్టు) కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ ఆదివారం అవనిగడ్డలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. సమావేశంలో సీఐ దుర్గారావు, ఎస్సై వై.సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  

ఏబీవీపీ ఫిర్యాదుతో...

వక్కలగడ్డ జెడ్పీ హైస్కూల్‌లో పీఈటీ ఓ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్ 17న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు శివరామప్రసాద్ వల్ల ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని చనిపోయిందని, దీనిపై విచారణ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై మూడురోజుల తరువాత డీవైఈవో విచారణకు రాగా.. కొంతమంది నాయకుల ఒత్తిళ్ల మేరకు గతంలో ఆరోపణలు చేసిన నాయకులు విచారణకు హాజరు కాలేదు. అప్పట్లో ‘సాక్షి’లో దీనిపై కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వీటిపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై తాజాగా నాలుగురోజుల నుంచి పత్రికల్లో పలు కథనాలు రావడం, ఏబీవీపీ ఆందోళన, కేసు నమోదు, ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలతో విద్యార్థిని మృతి ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు సీఐ దుర్గారావు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ ఆదేశాలు మేరకు రిటైర్డ్ హెడ్మాస్టర్, ఇంగ్లిష్ టీచర్‌ను శనివారం అరెస్టు చేశారు.  

బాలల పరిరక్షణ జిల్లా అధికారి విచారణ

శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ జిల్లా అధికారి విజయకుమార్ వక్కలగడ్డ హైస్కూల్‌లో శనివారం పలువురు ఉపాధ్యాయులు, సీఐ దుర్గారావు నుంచి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో జనార్దన ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థిని మృతి ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ విచారణ నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మల పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement