Retrospective
-
రెట్రో వివాద పరిష్కార దిశలో వేదాంత!
న్యూఢిల్లీ: కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగు వేసింది. ప్రభుత్వంపై ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ (ఐఏటీ)లో విచారణలో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్ మాతృసంస్థ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై పన్ను తీసివేయడంలో విఫలమైనందుకు కెయిర్న్ ఇండియా నుండి రూ. 20,495 కోట్ల పన్నులను (పెనాల్టీతో సహా) ఐటీ శాఖ డిమాండ్ చేసింది. అటు తర్వాత 2011లో కెయిర్న్ ఇండియాను అగర్వాల్ గ్రూప్ కొనుగోలు చేసింది. వేదాంతా లిమిటెడ్‌లో ఈ సంస్ధ విలీనమైంది. దీనితో పన్ను డిమాండ్ కేసు విషయంలో ఐటీ శాఖతో వేదాంత న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
నాతో నేను!
రోజూ మనల్ని ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఇష్టం ఉంటే మనం కూడా మాటలు కలుపుతాం. కానీ మాట్లాడిన అందరూ మనకు మిత్రులైపోరు. ఒకవేళ మిత్రులైనా అందరితో అన్నీ పంచుకోలేం. అందుకే రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకుని, ఆత్మపరిశీలన చేసుకుంటూ లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. ఇదే విషయాన్ని చెబుతున్నారు కథానాయిక త్రిష. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘నాతో నేను ఎక్కవ టైమ్ గడపడమే నా స్ట్రైస్ బస్టర్. అవసరమైతే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాను. నాకు గ్రేట్ ఫ్యామిలీ ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు. వారితో కూడా టైమ్ స్పెండ్ చేస్తా. కానీ నాకు నేను తోడుగా ఉండటం మాత్రం మరిచిపోను’’ అంటున్నారు త్రిష. ఇక సినిమాల విషయానికొస్తే... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు కంప్లీట్ అవుతున్నప్పటికీ ఆమె జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజెంట్ అరడజను తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష. ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరో మూడు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. -
29 వేల కోట్లు కట్టాల్సిందే..!
♦ కెయిర్న్ ఎనర్జీకి ఐటీ శాఖ తుది నోటీసులు ♦ దీన్లో అసలు 10.247 కోట్లు; మిగిలిందంతా వడ్డీయే ♦ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిందేనంటున్న ఐటీ శాఖ ♦ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ బాటలో కెయిర్న్ ఎనర్జీ న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి కేంద్రం రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకు పన్ను వర్తింపు) పన్ను షాకిచ్చింది. 2006లో కంపెనీ భారత్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన మూలధన లాభాలకుగాను రూ.29,000 కోట్లకుపైగా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఇందులో అసలు పన్ను మొత్తం రూ.10,247 కోట్లు. ఇక 2007 నుంచి ఈ పన్నుపై వడ్డీ రూపంలో 18,800 కోట్లు కట్టాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఐటీ శాఖ తొలిసారిగా 2014, జనవరి 22న ముసాయిదా అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా గత నెలలో వడ్డీతో కలిపి తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను ఇచ్చింది. 2015 ఏడాదికిగాను ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ ఈ వివరాలను వెల్లడించింది. కాగా, వొడాఫోన్ తర్వాత ఈ ఏడాది రెట్రోస్పెక్టివ్ పన్ను నోటీసును అందుకున్న రెండో కంపెనీ కెయిర్న్ ఎనర్జీ. అందులోనూ ఈ రెండూ బ్రిటన్‌కు చెందినవే కావడం గమనార్హం. బడ్జెట్లో ప్రకటనకు ముందే... రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వన్‌టైమ్ వడ్డీ, జరిమానా మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్ను అసలును చెల్లించిన వారికి ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రకటనకు ముందే ఐటీ శాఖ తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. 2012లో రెట్రోస్పెక్టివ్ పన్నును ఐటీ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కెయిర్న్ ఎనర్జీకి విధించిన పన్నుపై 2007 నుంచి వడ్డీని లెక్కించడం గమనార్హం. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును కెయిర్న్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఈ పన్ను వివాదంపై తాము అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పన్ను నోటీసు కారణంగా తమ వాటాదారులకు వచ్చిన నష్టానికి, కెయిర్న్ ఇండియాలో తమకున్న 9.8 శాతం వాటా షేర్లను విక్రయించకుండా నిలుపుదల(ఫ్రీజ్) చేసినందుకుగాను బిలియన్ డాలర్లను(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కూడా కెయిర్న్ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. తమ నుంచి ఐటీ శాఖ ఏదైనా రికవరీ చేసుకోగలిగితే ఈ దాదాపు 10 శాతం వాటా(విలువ దాదాపు 47.7 కోట్ల డాలర్లు)కు మాత్రమే పరిమితవుతుందని కెయిర్న్ పేర్కొంది. కెయిర్న్‌కు రూ.24,503 కోట్ల మూలధన లాభం: ఐటీ శాఖ 2006లో భారత్ కార్యకలాపాలకు చెందిన షేర్లను(అసెట్స్) అప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్సిడరీ కెయిర్న్ ఇండియాకు బదలాయించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ రూ.24,503 కోట్ల మూలధన లాభాన్ని ఆర్జించిందని ఐటీ శాఖ వాదిస్తోంది. ఈ ఆస్తుల బదలాయింపు తర్వాత కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కి వచ్చింది. దీనిద్వారా రూ.8,616 కోట్లను కంపెనీ సమీకరించింది. 2011లో కెయిర్న్ ఇండియాలోని మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్‌నకు కెయిర్న్ ఎనర్జీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ 8.67 బిలియన్ డాలర్లు. కెయిర్న్ ఇండియా పాత యాజమాన్యం కెయిర్న్ ఎనర్జీకి లభించిన మూలధన లాభాలపై విత్‌హోల్డింగ్ పన్నును ముందే తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కెయిర్న్ ఇండియాకు కూడా ఐటీ శాఖ రూ.20,495 కోట్ల డిమాండ్ నోటీసును ఇదివరకే జారీ చేసింది. ఇందులో అసలు పన్ను రూ.10,248 కోట్లు కాగా, వడ్డీ రూ.10,247 కోట్లుగా ఉంది. అయితే, ఈ పన్ను డిమాండ్ ఆదేశాలను కెయిర్న్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కాగా, రూ.14,200 కోట్ల పన్ను బకాయిలు(హచిసన్ ఎస్సార్‌లో వాటా కొనుగోలుపై లభించిన మూలధన లాభాలకు గాను) చెల్లించాలంటూ వొడాఫోన్‌కు గత నెలలోనే ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీచేయడం తెలిసిందే. భారత్‌లో పన్నులకు సంబంధించిన సరళమైన, స్థిరమైన వ్యవస్థను తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఐటీ శాఖ చర్యలు ఉన్నాయంటూ వొడాఫోన్ దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వివాదం కూడా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉంది. -
‘రెట్రోస్పెక్టివ్’ పన్నుకు ఇక చెల్లు!
♦ భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో ప్రధాని మోదీ హామీ ♦ ఆ విధమైన పన్నుల విధానం ఇకపై ఉండబోదని స్పష్టీకరణ చండీగఢ్: భారత్‌లో రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానం(పాత ఒప్పందాలకూ పన్నుల వర్తింపు) ఇక గతించిన అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విధమైన పన్నుల విధింపు అనేది ఇక్కడ మళ్లీ ఎప్పుడూ ఉండబోదని హామీనిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పర్యటన సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. వొడాఫోన్ పన్ను కేసు ఇతరత్రా ఇటువంటివే మరికొన్ని అంశాల కారణంగా భారత్‌లో స్థిరమైన పన్నుల విధానం లేదంటూ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మరో 15 ఏళ్లపాటు భారత్‌లో సుస్థిరమైన పాలన, స్థిరమైన పన్నుల వ్యవస్థ ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ సదస్సు సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లందరికీ స్పష్టం చేస్తున్నా. మా ప్రభుత్వం సరళతరమైన, స్థిరమైన పన్నుల విధానానికి కట్టుబడి ఉంది. రెట్రోస్పెక్టివ్ పన్ను అనేది ఇక గతం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటిది పునరావృతం కాదు. మా ప్రభుత్వమే కాదు భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధానమైన పన్నుల విధింపు జోలికివెళ్లవని హామీనిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లందరికీ.. రానున్న ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లలో ఎలాంటి పన్నుల విధానం అమలవుతుందనేది స్పష్టంగా తెలుస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో పాటు ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టండి... భారత్‌లో చౌక ఉత్పాదక వ్యయాన్ని అవకాశంగా మలచుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ప్రధానంగా తయారీకి సంబంధించి డిఫెన్స్ రంగంలో అపార వ్యాపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ‘రక్షణ దళాలకు సంబంధించి డిఫెన్స్ తయారీ రంగాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మీకు(ఫ్రెంచ్ కంపెనీలు) అన్నివిధాలుగా సహకారం అందిస్తాం’ అని మోదీ వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) భారత్ అత్యంత ప్రధానమైన గమ్యంగా అవతరించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే వ్యాపారాలకు సానుకూల దేశాల ర్యాంకింగ్‌లో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. స్వల్పకాలంలోనే ఎఫ్‌డీఐలు 40 శాతం ఎగబాకడం దీనికి నిదర్శనం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుపరిపాలన దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇవే ప్రపంచాన్ని భారత్‌వైపు ఆకర్షిస్తున్నాయి’ అని ప్రధాని తెలిపారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాన్ని ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’గా మోదీ అభివర్ణించారు. ‘అనేక రంగాల్లో ఇరు దేశాలు సమష్టిగా పనిచేసేందుకు అవకాశాలున్నాయి. మీకు(ఫ్రాన్స్) ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇతరత్రా అంశాలు మాకు అవసరం. మా దగ్గరున్న అపారమైన మార్కెట్ మీకు అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే నెట్వర్క్ ఆధునీకరణకు సహకారం అందించాల్సిందిగా మోదీ ఫ్రాన్స్‌ను కోరారు. భారత్ అభివృద్ధి విధానానికి ఫ్రాన్స్ నైపుణ్యం అవసరమని చెప్పారు. భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించే విషయంలో చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటోందని కూడా ఈ సందర్భంగా మోదీ వివరించారు. రైల్వేలో డీజిల్ ఇంజిన్ల స్థానంలో భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ ఇంజిన్లను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారంలో వినూత్న విధానాలు: రాష్ట్రపతి న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారం నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్ 2016 నివేదిక ప్రకారం 130) మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రెండురోజుల కార్యక్రమాన్ని ఆదివారం నాడు ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినూత్న పన్ను వివాద వ్యవస్థ ద్వారా ఈ వివాదాలు పెరక్కుండా చూడాలని సూచించారు. తద్వారా ఈ అంశాన్ని దేశ వృద్ధి బాటలో ఒక భాగంగా మలిచే చర్యలు తీసుకోవాలని సూచించారు.